నాలుగు గంటల్లోనే మహిళ ఆచూకీ లభ్యం
కాకినాడ క్రైం: మతి స్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన వృద్ధురాలి ఆచూకీని గంటల వ్యవధిలోనే పోలీసులు కనిపెట్టారు. కాకినాడ టూటౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ గాంధీనగర్‌లోని ఇంద్రపాలెం పోలీస్‌స్టేషన్ వెనుక జెట్టి వెంకటేశ్వరరావు, అతడి భార్య లక్ష్మి నివాసముంటున్నారు. 72 ఏళ్ల వయసున్న లక్ష్మికి మతిస్థిమితం లేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. వెంటనే వెంకటేశ్వరరావు కాకినాడ టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ రఘువీర్ ద్వారా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దృష్టికి ఈ విషయం వెళ్లింది. ఆయన ఆదేశాలతో పోలీసులు నగరాన్ని నాలుగు గంటల పాటు జల్లెడ పట్టారు. చివరకు కలెక్టరేట్ వెనుక రోడ్డులోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో లక్ష్మిని కనిపెట్టారు. ఆమెకు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలో మహిళ ఆచూకీ కనిపెట్టిన టూటౌన్ సీఐ అప్పలనాయుడు, ఆయన బృందాన్ని ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment