అభివృద్ధా? ఆధి‘పైత్యమా’?
పిఠాపురం: టీడీపీ – జనసేన ఆధిపత్య పోరు పిఠాపురం ప్రభుత్వాస్పత్రి సాక్షిగా మరోసారి బయటపడింది. అభివృద్ధికి సంబంధించిన అసలు విషయాన్ని పక్కన పెట్టేసి.. ఎవరికి వారే తమ ఆధిపత్యం నిరూపించుకోడానికి చేసిన ప్రయత్నం రచ్చ రచ్చగా మారింది. దీనికి సంబంధించిన వివరాలివీ..
పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇటీవల జీఓ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సీహెచ్‌సీకి కొత్తగా అభివృద్ధి కమిటీని నియమించారు. ఇందులో జనసేన నుంచి బొజ్జా సతీష్, టీడీపీ నుంచి వేణుం సురేష్‌లను నియమించారు. వీరి ప్రమాణ స్వీకారోత్సవం గురువారం సీహెచ్‌సీలో ఏర్పాటు చేశారు. దీని కోసం సిద్ధం చేసిన వేదికపై ఆస్పత్రి వర్గాలు ఏ రాజకీయ నాయకుడి ఫొటోలూ లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాస్, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ తమ తమ అనుచరులతో వచ్చారు. వేదికపై స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో లేకుండా ఫ్లెక్సీ పెట్టడంపై జనసేన నేతలు ఆందోళనకు దిగారు. దీంతో, ఆస్పత్రి వైద్యాధికారులు వెంటనే పవన్ కల్యాణ్ ఫొటోతో పాటు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఫొటోలతో మరో ఫ్లెక్సీ తయారు చేయించి, స్టేజిపై ఏర్పాటు చేశారు. పక్కనే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. అయితే, అది అక్కడెందుకంటూ జనసేన కార్యకర్తలు ఆ ఫ్లెక్సీని తీసి పక్కన పడేశారు.
దీనిపై వర్మ ఆగ్రహించారు. అయితే, తన ఫొటో ఉన్న ఫ్లెక్సీ పక్కన పడేశారనే విషయాన్ని ప్రస్తావించకుండా.. వేదికపై ఉన్న ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో చిన్నదిగా వేశారంటూ నిలదీశారు. దీంతో ఈసారి టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. కావాలనే చంద్రబాబు ఫొటో చిన్నదిగా వేశారని ఆస్పత్రి వర్గాలతో వర్మ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిని అదుపు చేయలేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో వర్మ తమ సభ్యుడు వేణుం సురేష్‌తో కలిసి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఒక ముఖ్యమంత్రికి విలువ ఇవ్వడం ఆస్పత్రి అధికారులకు తెలియలేదని, 100 పడకల ఆస్పత్రిగా జీఓ ఇచ్చింది చంద్రబాబేనని, ఆయనను ఇలా కించపర్చడం, అవమానించడం పెద్ద తప్పుగా భావిస్తున్నామని ఆయనన్నారు.
వర్మ వెళ్లిపోయాక ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌లు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నేతగా బొజ్జా సతీష్‌తో ప్రమాణ స్వీకారం చేయించి, సమావేశాన్ని ముగించారు. ఇరు పార్టీల ఫ్లెక్సీల గొడవతో మధ్యాహ్నం జరగాల్సిన ఈ కార్యక్రమం సాయంత్రం వరకూ వివాదాలతో కొనసాగింది. సీఎం చంద్రబాబు ఫొటో చిన్నదిగా వేయడం వల్ల కాదని, ఫ్లెక్సీపై తన ఫొటో వేయనందువల్లే వివాదం సృష్టించి వర్మ వెళ్లిపోయారని జనసేన నేతలు వ్యాఖ్యానించడం కొసమెరుపు. నాయకుల అర్థం లేని ఆందోళనలతో ఏం చేయాలో తెలియక నివ్వెరపోవడం ఆస్పత్రి వైద్యాధికారుల వంతయ్యింది.
ఫ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ
సమావేశంలో ఫ్లెక్సీల రగడ
ఫ పవన్ కల్యాణ్ ఫొటో లేదని
జనసేన ఆందోళన
ఫ పవన్ ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు
చేసిన ఆస్పత్రి అధికారులు
ఫ చంద్రబాబు ఫొటో చిన్నదిగా
వేశారంటు సమావేశం
బహిష్కరించిన టీడీపీ నేత వర్మ
ఫ ఇదే రాజకీయమంటూ
నివ్వెరపోయిన వైద్యాధికారులు
Comments
Please login to add a commentAdd a comment