కుక్కుటేశ్వరా.. మన్నించు
పిఠాపురం: పవిత్ర పాదగయ క్షేత్రంలో వరుసగా అపచారాలు జరుగుతున్న పట్టించుకుంటున్న వారే లేకుండా పోయారు. సనాతన ధర్మానికి కేరాఫ్‌గా చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇలాకా.. పిఠాపురంలోని సుప్రసిద్ధ కుక్కుటేశ్వరస్వామి క్షేత్రంలోనే.. వరుసగా చోటు చేసుకుంటున్న అపవిత్ర ఘటనలు భక్తులను కలవరపరుస్తున్నాయి.
దేశంలోని మూడు గయా క్షేత్రాల్లో ఒకటి.. అష్టాదశ శక్తి పీఠాల్లో పదోది.. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి అవతారంగా భక్తులు కొలిచే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన దివ్యభూమి పిఠాపురం. ఇంతటి ప్రసిద్ధి పొందిన ఈ పట్టణంలో కొలువైన పాదగయ క్షేత్రాన్ని దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు కొన్ని రోజులుగా కాసులు కురిపించే ఆలయంగా మాత్రమే చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ ప్రతిష్టను దెబ్బ తీసేలా వరుసగా అపచారాలు జరుగుతున్నా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు.
అపచారాల పరంపర
ఫ ఇటీవల మహిళా అఘోరీని కుక్కుటేశ్వరస్వామి వారి గర్భగుడిలోకి అనుమతించారు. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. నిబంధనలకు విరుద్ధగా వివస్త్రగా ఉన్న ఆమెను ఆలయంలోకి ఎలా అనుమతించారని ఆలయ అధికారులపై భక్తులు మండిపడ్డారు.
ఫ ఇటీవలి కార్తిక మాసోత్సవాల సమయంలో అన్య మతస్తుడిని ఆలయంలో నియమించారు. ఆ వ్యక్తితో ఏకంగా మూలవిరాట్టుకు అభిషేకాలు చేసే పాలు అందజేసే పనులు చేయిస్తూండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫ ఇటీవల పాదగయ క్షేత్రం దత్తాత్రేయ మండపంలోని యజ్ఞ వేదికలో ఆలయ రసీదు పుస్తకాలు వేసి, దహనం చేయడం తీవ్ర దుమారం రేపింది. పవిత్రమైన ఆలయ అగ్నిగుండంలో కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి చిత్రాలు ఉన్న పుస్తకాలు వేసి, దహనం చేయడంపై భక్తులు తీవ్రంగా మండిపడ్డారు.
ఫ తాజాగా స్వామి వారి పవిత్ర ప్రసాదంలో పురుగులు వచ్చాయి. దీనిపై భక్తుల ఫిర్యాదు మేరకు దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ) సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు విచారణ నిర్వహించారు. అయితే, ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన ఈఓను పక్కన కూర్చోబెట్టుకుని విచారణ చేయడంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విచారణ సందర్భంగా జనసేన నేతలు పాదగయలో తిష్ట వేయడం పైనా విమర్శలు వచ్చాయి.
ఫ భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షంలో వేలాదిగా ప్రజలు తమ పితృదేవతాలకు పాదగయ క్షేత్రంలో పిండ ప్రదానాలు నిర్వహించారు. ఆ సందర్భంగా తమ విశ్వాసం ప్రకారం పిండాలను ఆలయ పుష్కరిణిలో కలిపేవారు. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రపరచకపోవడంతో పుష్కరిణి జలాలు దుర్గంధభరితంగా మారాయి. పితృపక్షం ముగిసిన అనంతరం ఆశ్వయుజ మాసం ప్రారంభమై, శరన్నవరాత్ర ఉత్సవాలు మొదలయ్యాయి. ఆ సమయంలో పుష్కరిణి జలాలను తొలగించే పని చేపట్టారు. దీంతో శరన్నవరాత్ర ఉత్సవాల సందర్భంగా పాదగయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశం లేకుండా పోయింది.
ఫ ఆలయంలో ఇలా వరుస అపచారాలు జరుగుతున్నా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
లోటుపాట్లు లేకుండా చర్యలు
పాదగయ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాం. ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలపై పకడ్బందీగా విచారణలు జరిపి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. నేను కొత్తగా బాధ్యతలు తీసుకోవడం వల్ల కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది.
– కాట్న జగన్మోహన్ శ్రీనివాస్, ఈఓ, పాదగయ
పారదర్శకంగా విచారణ
విచారణ పారదర్శకంగానే నిర్వహించాం. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– సుబ్బారావు, దేవదాయ శాఖ ఆర్‌జేసీ
ఫ పాదగయ క్షేత్రంలో ఆగని అపచారాలు
ఫ తాజాగా ప్రసాదంలో పురుగులు
ఫ గతంలోనూ వరుస ఘటనలు
ఫ విచారణలతోనే
సరిపెడుతున్న అధికారులు
ఫ మండిపడుతున్న భక్తులు
నిష్పక్షపాతంగా విచారణ జరపాలి
కాశీ తరువాత అంతటి పుణ్యస్థలిగా భావించే పవిత్ర పుణ్యక్షేత్రం పాదగయలో ఇన్ని అపచారాలు, అధర్మాలు జరుగుతున్నా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణల పేరుతో కాలక్షేపం చేయడం అనుమానించాల్సిన విషయం. ఆలయంలో ఎవరి వల్ల తప్పులు జరుగుతున్నా ఈఓ బాధ్యత వహించాల్సి ఉంటుంది. వరుస అపచారాలపై విచారణలు చేయడం తప్ప తగిన చర్యలు తీసుకున్న ఆనవాళ్లు లేవు. కింది స్థాయి సిబ్బందిని బలి చేయడం ఎంత వరకూ సమంజసమో ఉన్నతాధికారులే చెప్పాలి. ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా చూడాలి? నిత్యం పరిశీలించి నాణ్యతను గుర్తించాల్సిన అధికారి సరిగ్గా పట్టిచుకోకపోతే ఇలాగే తప్పులు జరుగుతూంటాయి. ఉన్నతాధికారులు ఇప్పటికై నా కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే భక్తులు ఉద్యమించే పరిస్థితి వస్తుంది.
– కొండేపూడి శంకరరావు, సామాజిక కార్యకర్త, పిఠాపురం
Comments
Please login to add a commentAdd a comment