ఏలేరులో 20.86 టీఎంసీల నీటి నిల్వలు
ఏలేశ్వరం: పరివాహక ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా తగ్గాయి. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, గురువారం 84.93 మీటర్లుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, 20.86 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు 800, విశాఖకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. పంపా, తిమ్మరాజు చెరువుకు నీటి విడుదలను నిలిపివేశారు.
శ్రీపాద శ్రీవల్లభుని హుండీ
ఆదాయం రూ 22 లక్షలు
పిఆపురం: పట్టణంలోని ప్రముఖ దత్త క్షేత్రమైన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానానికి హుండీల ద్వారా రూ 22,05,551 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఆర్.సౌజన్య తెలిపారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ తనిఖీదారు వి.ఫణీంద్ర కుమార్ ఆధ్వర్యాన గురువారం హుండీల లెక్కింపు నిర్వహించారు. గత జూన్ 29 నుంచి ఇప్పటి వరకూ ఈ ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో రత్నగిరి సత్యదేవుని ఆలయ ప్రాంగణం గురువారం కిక్కిరిసిపోయింది. టూరిస్టు బస్సులు, వివిధ వాహనాల్లో శబరిమల వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని దర్శించుకున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయం ప్రాంగణం, వ్రత మండపాలు భక్త జనసందోహంతో నిండిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. స్వామివారిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సత్యదేవుని వ్రతాలు 1,200 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
సత్యదేవుని నిజరూప దర్శనం
రత్నగిరి వాసుడు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుడు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. ప్రతి రోజూ పట్టువస్త్రాలు, స్వర్ణ, వజ్రాభరణాలతో దర్శనమిచ్చే స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్టులను పుష్పమాలలతో మాత్రమే అలంకరించారు.
నేడు చండీహోమం
రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ హోమం, అనంతరం పూర్ణాహుతి నిర్వహిస్తారు. రూ.750 టికెట్టుతో భక్తులు ఈ హోమంలో పాల్గొనవచ్చు.
నేటి నుంచి ఆర్టీసీ
కార్గో మాసోత్సవాలు
కాకినాడ: ఏపీఎస్ ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు శుక్రవారం నుంచి జనవరి 19 వరకూ నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ కార్గోలో కేజీ నుంచి 50 కేజీల బరువు వరకూ బుక్ చేసిన వస్తువులను 10 కిలోమీటర్ల వరకూ డోర్ డెలివరీ చేస్తామన్నారు. ఆర్టీసీ కార్గో సేవలపై మరింత అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment