ధరదడలు
సోమవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
ధరలు అదుపు చేయాలి
పెరిగిన ఉల్లి ధరలు నాలుగు నెలలుగా తగ్గడం లేదు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల నిత్యావసర వస్తువులూ అందుబాటులో లేకుండా పోతున్నాయి. పెరిగిన ధరలు దిగిరాకపోవడంతో అంత వ్యయం భరించలేక వినియోగదారులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిత్యావసరాలు, కూరగాయల ధరలను అదుపు చేయాలి.
– పోకనాటి ప్రభాకరమూర్తి, వినియోగదారుడు, కాకినాడ
నిత్యావసరాల ధరలు కిలోకు రూ.లలో
కందిపప్పు 169.00 – 180.00
పొట్టు మినప్పప్పు 135.00
పెసరపప్పు 120.00
వేరుశనగ గుళ్లు 140.00
పెసలు 125.00
మినప గుళ్లు 148.00
బ్రాండెడ్ మినపగుళ్లు 240.00
శనగపప్పు 98.00
బెల్లం 74.00
ఇడ్లీ రవ్వ 40.00
చింతపండు 155.00
శనగలు 95.00
ఎండుమిర్చి 260.00
ధనియాలు 210.00
జీలకర్ర 375.00
పామాయిల్ (లీటర్) 140.00
వేరుశనగ నూనె (లీటర్) 260.00
కోడిగుడ్డు (ఒక్కొక్కటి) 7.50
నాటు కోడిగుడ్డు 15.00 – 20.00
నానాటికీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు వంటింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. కూరగాయల రేట్లు వింటేనే బెంబేలెత్తిపోతోంది.. కొనకుండానే ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది.. ఉప్పు నుంచి పప్పు వరకూ ప్రతి వస్తువు ధరా కొండెక్కి కూర్చుంది.. చుక్కలు చూస్తున్న ధరలతో జనం విలవిలలాడుతున్నారు.. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది.
ఫ ఠారెత్తిస్తున్న కూరగాయల రేట్లు
ఫ కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి
ఫ తగ్గేదేలే.. అంటున్న పప్పులు
ఫ కొండెక్కిన కోడిగుడ్ల రేటు
ఫ మరిగించకుండానే మంట పుట్టిస్తున్న నూనెలు
ఫ పెరిగిన ధరలతో జనం విలవిల
ఫ పట్టించుకోని ప్రభుత్వం
కాకినాడ సిటీ: కొద్ది రోజులుగా మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఆరేడు నెలల క్రితం వరకూ స్థిరంగా ఉన్న ధరలు.. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ.. పట్టపగ్గాలు లేకుండా పెరుగుతూ.. వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. కొండెక్కిన ధరలు దిగి రాకపోవడంతో సామాన్యులపై పెనుభారమే పడుతోంది. ఇప్పటికే పంటలు సరిగ్గా పండక రైతులు, కూలీలు.. కూటమి పాలనలో సంక్షేమ పథకాలు అందక పేదలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో.. పులి మీద పుట్రలా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతూండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడంతో విలవిలలాడుతున్నారు.
కూరగాయాలు
మార్కెట్‌లో కూరగాయల ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తుతున్న పరిస్థితి. టమాటా, వంగ, బీర, బంగాళాదుంప వంటి కూరగాయల రేట్లు కిలోకు రూ.50 పైనే పలుకుతున్నాయి. క్యాప్సికం, ఆకాకర వంటి వాటి రేట్లు రూ.80 నుంచి రూ.120 వరకూ చెబుతున్నారు. ఇతర కూరగాయల రేట్లు కూడా వింటేనే హీటు పుడుతున్న పరిస్థితి. ఆకుకూరలు కూడా గతంలో రూ.10కి రెండుమూడు కట్టలు ఇచ్చేవారు. ఇప్పుడు వాటి ధర రూ.20కి పెరిగింది.
ఉల్లికిపాట్లు
ఇక ప్రతి ఒక్కరూ వినియోగించే ఉల్లి ధర మామూలుగా లేదు. ఉల్లిపాయ కోస్తే కాదు.. కొంటేనే వినియోగదారులకు కన్నీళ్లు వస్తున్న పరిస్థితి. ఆరు నెలల కిందట కిలో ఉల్లిపాయల ధర రూ.30 కాగా, ఇప్పుడు ఏకంగా రూ.80కి పెరిగింది. ఆరుదల లేకుండా కాస్త నాసిరకమైతే రూ.60 వరకూ చెబుతున్నారు. ఇక నీరుల్లి కంటే వెల్లుల్లి ధర ఏకంగా 7 రెట్లు అధికంగా పలుకుతోంది. ఆరు నెలల కిందట కిలో వెల్లుల్లి ధర రూ.200 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.560కి ఎగబాకింది. ఏ కూర వండాలన్నా ఉల్లి, వెల్లుల్లి లేకపోతే రుచి ఉండదని, అందువల్లనే ఎంత ధర పలికినా కొనుగోలు చేయక తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.
నూనెలు సలసల
ఇక నూనెల ధరలదీ అదే రూటు. ఆరు నెలల క్రితం లీటరు పామాయిల్ రూ.85 కాగా.. ప్రస్తుతం రూ.140కి చేరింది. సన్‌ఫ్లవర్ నూనెల ధరలు రూ.115 నుంచి రూ.150, వేరుశనగ నూనె రేటు రూ.160 నుంచి ఏకంగా రూ.230కి పెరిగింది. వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం 20 శాతం అదనపు సుంకాన్ని విధించడంతో వీటి రేట్లకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. శుద్ధి చేసిన వంట నూనెలపై గతంలో ఉన్న 12.5 శాతం సుంకాన్ని కేంద్రం ఏకంగా 32.5 శాతానికి పెంచేసింది. దీంతో లీటరుపై రూ.35 నుంచి రూ.50 వరకూ ధర పెరిగింది. వంటనూనెలపై సుంకం పెంపును కూటమిలోని పార్టీ నాయకులు వ్యతిరేకించకపోవడంతో.. ఆ భారమంతా వినియోగదారులపై పడుతోంది.
గుడ్లు తేలేసేలా..
ఇక కోడిగుడ్ల ధర గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. పౌష్టికాహారం కావడంతో ఎక్కువ మంది గుడ్డును ఉపయోగిస్తున్నారు. బేకరీ ఫుడ్స్, నూడిల్స్ స్టాల్స్, రెస్టారెంట్లలో వీటి వినియోగం ఎక్కువగా ఉంది. గత ఆగస్టులో రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.5.70 ఉండగా ఇప్పుడు రూ.7.50కు పెరిగింది. పది రోజుల క్రితం 30 గుడ్ల ట్రే ధర రూ.130 ఉండగా నేడు రూ.210 పలుకుతోంది. కూరగాయలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా కొండెక్కడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దాపురం, మండపేట, రాయవరం, ఆలమూరు, రావులపాలెం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయి. ఉత్పత్తి తగ్గినందువల్లనే కోడిగుడ్ల ధరలు పెరిగిపోతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
నాటు కోడిగుడ్డు సెపరేటు
ఫారం గుడ్లే కాకుండా నాటు కోడి గుడ్లను కూడా మార్కెట్లో విక్రయిస్తున్నారు. గతంలో ఇది ఒక్కొక్కటి రూ.10కే లభించేది. ఇప్పుడు రూ.15 నుంచి రూ.20 వరకూ పలుకుతోంది. ఫారాల్లో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోవటంతో నాటుకోడి గుడ్ల ధరలను కూడా వ్యాపారులు నానాటికీ పెంచేస్తున్నారు.
స్పందించని ప్రభుత్వం
ధరలు పెరిగినప్పుడు మార్కెట్ రేట్ల కంటే తక్కువకు విక్రయించేందుకు ప్రభుత్వాలు సాధారణంగా ఏర్పాట్లు చేస్తాయి. తద్వారా ధరలకు కళ్లెం వేస్తాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇదేవిధంగా ఏర్పాట్లు చేసేవారు. టమాటా, ఉల్లి వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దుకాణాల ద్వారా తక్కువ ధరకే ప్రజలకు అందించేవారు. లభ్యత ఎక్కువ ఉన్న ప్రాంతాల నుంచి ఆయా సరకులు ప్రత్యేకంగా రప్పించి, ప్రజలకు అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు మండిపోతున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూండటంపై వినియోగదారులు మండిపడుతున్నారు.
కూరగాయల ధరలు కిలోకు రూ.లలో
టమాటా 48.00
వంకాయ 50.00
పచ్చిమిర్చి 40.00
బీరకాయలు 60.00
దొండకాయలు 56.00
బంగాళాదుంపలు 50.00
బీట్‌రూట్ 60.00
బీన్స్ గింజలు 160.00
ఆకాకర 120.00
క్యాప్సికం 80.00
కొత్త ఉల్లిపాయలు 55.00
పాత ఉల్లిపాయలు 80.00
క్యారెట్ 45.00
వెల్లుల్లి 560.00
హాస్టల్ విద్యార్థులకు కష్టమే..
కూరగాయలు, కోడిగుడ్లు, ఇతర నిత్యావసరాల ధరల అమాంతం కొండెక్కడంతో సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం నెలల తరబడి బిల్లులు మంజూరు చేయకపోవడంతో వారు అప్పులతో నెట్టుకొస్తున్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో హాస్టళ్ల నిర్వహణ కష్టంగా మారుతోందని వాపోతున్నారు. ధరలు తక్కువగా ఉన్న సమయంలోనే విద్యార్థులకు చిన్న సైజు గుడ్లు అందించేవారు. ఇప్పుడు రేట్లు పెరగడంతో ఆ చిన్న గుడ్లు కూడా అందకుండా పోతాయోమోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
మాంసాహారానిదీ అదే రూటు
మాంసాహారం ధరలు కూడా పెరుగుతున్నాయి. గతంలో కిలో చికెన్ రూ.160 నుంచి రూ.180 మధ్య లభించేది. ఇప్పుడు రూ.210 నుంచి రూ.220 వరకూ పలుకుతోంది. ఇక కిలో మటన్ రూ.వెయ్యి వరకూ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment