బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్ అసోషియేషన్ (ఏపీఎస్‌టీఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా వెంకటేశ్వరరావు ఆదివారం ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా మూలపేట జెడ్పీ హైస్కూల్ గణితోపాధ్యాయుడు పి.శరత్‌చంద్ర, ప్రధాన కార్యదర్శిగా బూరుగుపూడి జెడ్పీ హైస్కూల్ గణితోపాధ్యాయుడు ఎం.రాఘవులు నియమితులయ్యారు. వారిని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాడతామని, సభ్యత్వాల పెంపుదలకు కృషి చేస్తామని చెప్పారు.
లోవకు పోటెత్తిన భక్తులు
తుని: తలుపుమ్మ తల్లి లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 6 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదం విక్రయాల ద్వారా రూ.96,762, పూజా టికెట్ల ద్వారా రూ. 32,330, కేశఖండన టిక్కెట్ల ద్వారా రూ.4,200, వాహన పూజ టికెట్ల ద్వారా రూ.4,900, కాటేజీల ద్వారా రూ.41,082, విరాళాల ద్వారా రూ.69,762 కలిపి మొత్తం రూ.2,48,949 ఆదాయం వచ్చిందని వివరించారు.
నేడు పీజీఆర్‌ఎస్
కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ ఈ కార్యక్రమం జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మండల స్థాయిలో జరిగే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులు తప్పనిసరిగా ఉదయం 9.30 గంటలకే హాజరు కావాలని పేర్కొన్నారు.
నాచు మొక్కలు, కేజ్ కల్చర్‌కు హోప్ ఐలాండ్ అనుకూలం
కాకినాడ రూరల్: సముద్ర జలాల్లో నాచు మొక్కల పెంపకం (సీ వీడ్ కల్చర్), పంజరాల్లో చేపల పెంపకానికి (సముద్రపు కేజ్ కల్చర్) హోప్ ఐలాండ్ పరిసరాలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ టి.డోలా శంకర్ తెలిపారు. హోప్ ఐలాండ్ వద్ద దీనికి అనుకూలమైన ప్రాంతాలను కాకినాడకు చెందిన మత్స్యకారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సముద్రంలో పెంచే నాచు మొక్కలకు డిమాండ్ ఉందన్నారు, ఆస్ట్రోనాట్స్ ఆహారం బదులు నాచుతో తయారు చేసే క్యాప్సూల్స్ తీసుకుంటారని తెలిపారు. కేజ్ కల్చర్ ద్వారా అనుకూలమైన చేపలను పంజరాల్లో పెంచవచ్చన్నారు. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తామన్నారు. కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మత్స్యశాఖ కమిషనరేట్‌లోని మైరెన్ జేడీ పి.సురేష్, ఆక్వా ఫిషరీష్ జేడీ లాల్ మహమ్మద్, ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపాల్ సుమలత, మత్స్యశాఖ జేడీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
22కెకెడి263: హోప్ ఐలాండ్ పరిసరాలను పరిశీలిస్తున్న మత్స్యశాఖ కమిషనర్ తదితరులు
Comments
Please login to add a commentAdd a comment