పరిహారానికి కాలయాతన
ఉపాధి కోల్పోతున్నాం..
గోదావరిలో పైపులైన్ పనులతో ఏర్పడిన ఇసుక మేటలు తొలగించక మత్స్య సంపద తగ్గిపోతుంది. పైపులు వేసిన తరువాత పూడ్చివేత పనులు చేపట్టడం లేదు. మత్స్య సంపదపై ఇది కూడా ప్రభావం చూపుతుంది. చేపల వేట లేకపోవడంతో ఉపాధి లేకుండా పోయింది.
–సంగాని చిన్న కన్నయ్య,
బ్రహ్మసమేథ్యం, కాట్రేనికోన మండలం
మేము ఎలా బతికేది?
మాకు ఓఎన్జీసీ సంస్థ నుంచి రావాల్సిన నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఆ పరిహారం చెల్లించక, చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా సకాలంలో ఇవ్వక మేము ఎలా బతికేది. ప్రస్తుతం అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తుంది.
–ఓలేటి తేజ, బలుసుతిప్ప,
కాట్రేనికోన మండలం
ఫ నేటికీ అందని మత్స్యకార భరోసా
ఫ వాయిదాలు వేస్తున్న కూటమి ప్రభుత్వం
ఫ జిల్లాలో 23,458 మంది లబ్ధిదారులు
ఫ సీఎం చంద్రబాబు రావాలంటూ జాప్యం
ఫ గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా
అందజేత
సాక్షి, అమలాపురం: శ్ఙ్రీఅయ్యవారు వచ్చే వరకూ అమావాస్య ఆగాల్సిందేశ్రీశ్రీ అన్నట్టు ఓఎన్జీసీ సంస్థ మత్స్యకారులకు అందించే నష్ట పరిహారం పంపిణీ తీరు ఉంది. సంస్థ అందించే నష్ట పరిహారంతో పాటు వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకారులకు ఇచ్చే మత్స్యకార భరోసాను సైతం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. చంద్రబాబు రావాలి.. పరిహారం ఇవ్వాలి.. బాబు రావాలి.. భరోసా ఇవ్వాలి అంటూ జిల్లాకు చెందిన కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు వాయిదాల మంత్రం జపిస్తున్నారు.
చమురు సంస్థల కార్యకలాపాలతో నష్టపోయే అగ్నికుల క్షత్రియులకు క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన పరిహారం.. మత్స్యకార భరోసా నేటికీ అందలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు కావొస్తున్నా పరిహారం పంపిణీ తేదీపై ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. గత నవంబర్ 21వ తేదీన మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఓఎన్జీసీ పరిహారంతో పాటు మత్స్యకార భరోసా అందజేస్తారని లబ్ధిదారులు ఎదురు చూశారు. బాబు వస్తారని పరిహారం అందజేస్తారని కూటమి ప్రజాప్రతినిధులు సైతం చెప్పుకొచ్చారు. ఆ తేదీ వెళ్లిపోయి రోజులు గడుస్తున్నా పరిహారం ఎప్పుడు పంపిణీ చేస్తారనేది మాత్రం తేల్చలేదు. జిల్లాలో కాట్రేనికోన మండలం బ్రహ్మసమేథ్యం పంచాయతీ పరిధి గోదావరి పాయపై ఓఎన్జీసీ చమురు సంస్థ చేపట్టిన పైపులైనన్ పనులతో స్థానిక మత్స్యకారులకు వేట లేకుండా పోయింది. ఓఎన్జీసీ సంస్థ సముద్రం లోపల ఉన్న రిగ్గు (ఆఫ్‌షోర్ బావి) నుంచి గాడిమొగ సైట్ వరకూ బ్రహ్మసమేథ్యం పరిధిలో గోదావరి పాయల వెంబడి పైపులైనన్ పనులు చేపట్టింది. ఇందుకు అనువుగా నదీపాయల్లో పెద్ద ఎత్తున డ్రెడ్జింగ్ నిర్వహించింది. దీనివల్ల నెలల పాటు వేటకు అంతరాయం ఏర్పడింది. కాట్రేనికోన మండలంతో పాటు ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, కె.గంగవరం మండలాలతో పాటు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలానికి చెందిన గోదావరి నదీ పాయలను ఆనుకుని జీవిస్తున్న మత్స్యకారుల వేటకు అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ఓఎన్జీసీ సంస్థ తమ కార్యకలాపాలు ముగిసే వరకూ నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి జిల్లాలో 23,458 మంది మత్స్యకారులకు పరిహారం అందించాలి. ఒక్కో మత్స్యకారునికి రోజుకు రూ.460 చొప్పున నెలలో 25 రోజులకు రూ.11,500 ఇచ్చేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఓఎన్జీసీ అంగీకరించింది. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, పుదుచ్చేరి రాష్ట్ర ప్రత్యేక ప్రధినిధి మల్లాడి కృష్ణారావు, మత్స్యకార నాయకులతో జిల్లా కలెక్టర్ సమక్షంలో బాధిత లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఓఎన్జీజీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ముమ్మిడివరం, రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలో లబ్ధిదారులను గుర్తించారు. కోనసీమ జిల్లా పరిధిలో 16,408 మంది, కాకినాడ జిల్లా, పుదుచ్చేరి యానాం పరిధిలో 7,050 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డీబీటీ పద్ధతిలో బటన్ నొక్కి ఐదు విడతలుగా ఒక్కొక్కరికి రూ.2,76,000 చొప్పున రూ.647.44 కోట్లను 8 వేల మంది లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. సుమారుగా సంస్థ నుంచి తొమ్మిది నెలలకు పైబడి నష్ట పరిహారం లబ్ధిదారులకు రావాల్సి ఉందని బాధిత లబ్ధిదారులు చెబుతున్నారు. ఆ సంస్థ మాత్రం కేవలం ఐదు నెలల 21 రోజులకు నష్ట పరిహారం జిల్లా కలెక్టర్ వద్ద ఉందని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెల్లిస్తామని చెబుతోంది. ఇలా చూసినా వేట నష్టపోయిన మత్స్యకారులకు రూ.157.54 కోట్ల పరిహారం అందించాలి. అయితే తేదీలు మారుస్తూ ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతుంది. అసలు నష్ట పరిహారం తమకు వస్తుందో లేదో తెలియక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
నాలుగు నుంచి ఆరు నెలల్లోపు..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా చమురు సంస్థల పరిహారం మత్స్యకారులకు అందేది. కేవలం నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలోనే పరిహారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేవారు. మొత్తం ఐదు దఫాలుగా పరిహారం అందజేయగా మొదటి మూడు దఫాల్లో ఒక్కొక్కరికి రూ.46 వేల చొప్పున నాలుగు నెలలకు, చివరి రెండు సార్లు రూ.69 వేల చొప్పున ఆరు నెలలకు చెల్లించారు. మొత్తం 9,251 మందికి రూ.2,55,32,76,000 అందజేయడం గమనార్హం.
వేట లేక.. ఉపాధి దొరకక
చమురు సంస్థలు సముద్ర జలాలు, గోదావరి పాయల్లో చేపడుతున్న చమురు నిక్షేపాల వెలికితీత పనులు, చమురు వ్యర్థాలను విడుదల చేయడం, ఓడల రాకపోకలతో జరుగుతున్న శబ్ద కాలుష్యంతో మత్స్య సంపద తగ్గిపోయింది. గౌతమీ, వృద్ధ గౌతమీ పాయల్లో ఆయా చమురు సంస్థలు చేపట్టిన పైపులైన్ పనులతో ఇసుక మేటలు వేయడం, నదీ ప్రవాహం సక్రమంగా లేకపోవడంతో గోదావరి సహజత్వం కోల్పోయి మత్స్య సంపద తగ్గిపోయింది. చేపల వేట లేక జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పాయల్లో మత్స్య సంపద ఉత్పత్తి లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. చేపలు వేట లేకపోవడం, వేట సమయంలో ప్రభుత్వం చెల్లించే మత్స్యకార భరోసా, ఓఎన్జీసీ నష్టపరిహారం చెల్లించక పోవడంతో ఉపాధి కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు రావాల్సిన ఓఎన్జీసీ నష్టపరిహారం చెల్లించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
భరోసా ఎక్కడా?
సముద్ర వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వేట కోల్పోయిన మత్స్యకార కుటుంబానికి ఏడాదికి రూ. పది వేల చొప్పున పరిహారంగా అందించింది. 2023–24 ఏడాదికి గాను 9,821 మందికి రూ. 9,82,10,000 నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 2024–25 సంవత్సరానికి గాను 11,305 మంది లబ్ధిదారులను గుర్తించింది. ఎన్నికల సమయంలో మత్స్యకార భరోసాను రూ.20 వేలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ విధంగా చూస్తే ఈ ఏడాది మత్స్యకార భరోసా రూ.22.61 కోట్లు అందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment