శృంగార వల్లభుని సన్నిధికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో వెలసిన స్వయంభూ శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 9 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారని, ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదాన విరాళాల రూపంలో స్వామి వారికి రూ.1,74,675 ఆదాయం సమకూరిందని ఈఓ చెప్పారు. 2,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.
బాలిక వైద్యానికి రోటరీ సాయం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బాణసంచా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ బాలిక వైద్యానికి రోటరీ సెంట్రల్ క్లబ్ ఆర్థిక సహాయం అందజేసింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరబాబు కుమార్తె జాహ్నవి దీపావళి పండగ నాడు బాణసంచా కాలుస్తూండగా ప్రమాదానికి గురైంది. 70 శాతం కాలిన గాయాలతో కాకినాడలోని క్యాపిటల్ ఆసుపత్రిలో చేరింది. నిరుపేద అయిన వీరబాబుకు రోటరీ సెంట్రల్ క్లబ్ అండగా నిలిచింది. అతడి కుమార్తె వైద్యానికి ఎపెక్స్ కంపెనీ అధినేత కేఎస్ మూర్తి రూ.లక్ష, రోటరీ సెంట్రల్ ట్రస్ట్ నుంచి మరో రూ.2 లక్షలు విడుదల చేసింది. క్లబ్ అధ్యక్షుడు బంగారు కృష్ణమూర్తి ఈ విషయం తెలిపారు. మొత్తం రూ.3 లక్షల చెక్కును శనివారం వీరబాబుకు అందించారు. ఆసుపత్రి యాజమాన్యం ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. ఇప్పటి వరకూ జాహ్నవి వైద్యానికి రూ.6 లక్షలు ఖర్చయ్యిందని, మరో రెండు నెలలు పాటు వైద్యం చేయాల్సి ఉంటుందని, దాతలు సహకరించాలని ఆయన కోరారు. సహాయం చేయాలనుకునేవారు 98482 10897 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
హైస్కూల్ ప్లస్ కొనసాగించాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇంటర్మీడియెట్ విద్య అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్‌ను యథావిధిగా కొనసాగించాలని స్కూల్ టీచర్స్ అసోషియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని, ప్లస్‌టూ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలున్నందున ల్యాబ్ నిర్మాణాలకు నిధులు విడుదల చేయాలని, మండలానికో ప్లస్‌టూ కో ఎడ్యుకేషన్ పాఠశాల ఉండాలని, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువనే సాకుతో ఈ వ్యవస్థను రద్దు చేయడం సరి కాదని పేర్కొన్నారు.
జీపీటీలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ (జీపీటీ) కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి కొండలరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్సుకు ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు వారు అర్హులన్నారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, డొమెస్టిక్ నాన్ వాయిస్ కోర్సుకు పదో తరగతి ఆపైన ఉత్తీర్ణులై, 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తామని, వివరాలకు 90107 37998 నంబరులో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment