జననేతకు జేజేలు | - | Sakshi
Sakshi News home page

జననేతకు జేజేలు

Published Sun, Dec 22 2024 2:34 AM | Last Updated on Sun, Dec 22 2024 2:34 AM

జననేతకు జేజేలు

జననేతకు జేజేలు

ఘనంగా జగన్‌ జన్మదిన వేడుకలు

సేవలతో అభిమాన నేతకు నీరాజనం

ప్రజల గుండెల్లో చెక్కుచెదరని అభిమానం

జిల్లావ్యాప్తంగా కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, అభిమానులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికార పార్టీ, విపక్షం అనే వ్యత్యాసం చూపకుండా నిత్యం పేదల పక్షాన నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల గుండెల్లో ఉన్న ఆదరాభిమానాలు ఏమాత్రం చెక్కుచెదరలేదు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన ఆ జననేత పుట్టిన రోజు వేడుకలే దీనికి సాక్షిగా నిలిచాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో పార్టీ నేతలు, అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం కనిపించింది. పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్‌కు ప్రజలు నీరాజనం పలికారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కో ఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కడికక్కడ తమ అభిమాన నేత జగన్‌ పుట్టిన రోజును వేడుకగా నిర్వహించారు. పెద్ద ఎత్తున కేక్‌లు కట్‌ చేసి, అందరికీ పంచి, సంబరాలు చేసుకున్నారు. నిరుపేదలకు దుప్పట్లు, రోగులకు పండ్లు పంపిణీ చేసి, తమ ప్రియ నేతకు సేవా హారతి పట్టారు

వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో..

మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యాన జగన్‌ పుట్టిన రోజు వేడుకలను పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేసిన ఏకై క నాయకుడు దేశంలో ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు. చెప్పిందే చేస్తా, చేయగలిగిందే చెప్తా అని ధైర్యంగా చెప్పే నాయకుడని కొనియాడారు. ఒక నాయకుడి వెనుక ఉన్నామంటే తల ఎత్తుకునే తిరిగేలా ఉండాలని, ఒక ధైర్యం వెనకాల ఉన్నామనే ఫీలింగ్‌ ఉండాలని, అవన్నీ ఒక్క జగన్‌మోహన్‌రెడ్డిలోనే ఉన్నాయని అన్నారు.

పిఠాపురంలో..

మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వంగా గీతా విశ్వనాథ్‌ ఆధ్వర్యాన గొల్లప్రోలు మార్కెట్‌ సెంటర్‌లో జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి, అందరికీ పంచిపెట్టారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో కూడా కేక్‌ కట్‌ చేసి, నాయకులు, కార్యకర్తలకు పంచారు. స్థానిక సౌజన్య దివ్యాంగుల ట్రస్ట్‌ ఆశ్రమంలో దివ్యాంగులకు వంగా గీత దుప్పట్లు పంపిణీ చేశారు.

పెద్దాపురంలో..

కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. సామర్లకోట ప్రసన్నాంజనేయ ఆలయం వద్ద దివగంత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి దవులూరి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. సిరి మానసిక కేంద్రంలోను, ఆస్పత్రిలోను రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పెద్దాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీ మంగతాయారు, రాష్ట్ర అయ్యెరక సంఘ చైర్మన్‌ ఆవాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

● పులిమేరు శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబుతో పాటు కిర్లంపూడి మండల నాయకులు జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే, గిరిబాబు ఆధ్వర్యాన పార్టీ నేతలు కిర్లంపూడిలో కూడా జగన్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైఎస్సార్‌ సీపీ నేత ముదునూరి మురళీకృష్ణంరాజు సుమారు 250 మంది మహిళలకు చీరలు, ఏలేశ్వరంలో చిరు వ్యాపారులకు, పేదలకు పండ్లు పంపిణీ చేశారు.

● జగ్గంపేట, గోకవరం గ్రామాల్లో మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట నరసింహం కేక్‌ కట్‌ చేశారు. వంద మంది మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కేక్‌ కట్‌ చేసి, అభిమానులు, పార్టీ నాయకుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

● కాకినాడ నగరంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ మాజీ చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి ఆధ్వర్యాన జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, అల్లి రాజబాబు, మాజీ కార్పొరేటర్లు, అభిమానులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన..

మాజీ మంత్రి, పార్టీ తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు సంబరంగా జరిగాయి. తుని రూరల్‌ మండలం ఎస్‌.అన్నవరంలో జరిగిన వేడుకల్లో రాజా కేక్‌ కట్‌ చేసి, అందరికీ పంచారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాల నుంచి పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు జగన్‌పై అభిమానంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement