సంక్షోభంలో సమతూకమా! | - | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో సమతూకమా!

Published Sun, Dec 22 2024 2:34 AM | Last Updated on Sun, Dec 22 2024 2:34 AM

సంక్షోభంలో సమతూకమా!

సంక్షోభంలో సమతూకమా!

సమీకరణాలతో డీసీ చైర్మన్ల నియామకం

అనుభవాన్ని పట్టించుకోని

కూటమి ప్రభుత్వం

తూర్పు డెల్టా జనసేనకు..

మధ్య డెల్టా టీడీపీకి..

సాగునీటి యాజమాన్యంపై అన్నదాతల పెదవి విరుపు

సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా సంక్షోభంలో ఉంది. మూడు పంటలు పండే ఈ ప్రాంతంలో ఖరీఫ్‌, రబీ వరిసాగు చేయలేని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పంట కాలువలు అధ్వానంగా.. మురుగునీటి కాలువలు పూడుకుపోయి నీటి యాజమాన్యం అస్తవ్యస్తంగా తయారైంది. సిబ్బంది అనుభవ లేమి, నిర్లక్ష్యంతో డెల్టా వ్యవస్థ ఇలా తయారైంది. కనీసం పూడిక తొలగింపునకు సైతం ప్రభుత్వం నిధులు ఇవ్వని దుస్థితి. ఈ సమయంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్లుగా అనుభవం ఉన్న వారిని, సమర్థులను ఎంపిక చేసి ఉంటే సరిపోయేది. కానీ, రాజకీయ పార్టీ.. సామాజిక వర్గాలు.. ప్రాంతాల ప్రాతిపదికన కొత్తవారిని ఎంపిక చేయడం, వారికి డెల్టా వ్యవస్థపై పెద్దగా అవగాహన లేకపోవడం రైతులను నిరుత్సాహానికి గురి చేస్తోంది.

గోదావరి డెల్టా ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు సాఫీగా సాగిపోయాయి. టీడీపీ అధిష్టానం.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించిన వారిని చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా డిస్ట్రిబ్యూటరీ కమిటీల (డీసీ) చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదవుల పంపిణీలో అసంతృప్తులు తలెత్తకుండా గోదావరి డెల్టాను తూర్పు, మధ్య డెల్టాలుగా విభజించి, చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఎన్నుకున్నారు. ఒక ప్రాజెక్టు కమిటీ పరిధిలో ఇద్దరు చైర్మన్ల అవసరం ఏమిటో.. వారి విధి విధానాలు, బాధ్యతలు ఏమిటో ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీకి అమలాపురం, తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ కాకినాడ కలెక్టరేట్లలో శనివారం ఎన్నికలు నిర్వహించారు.

గోదావరి మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా పి.గన్నవరం డీసీ గుబ్బల శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. ఆయన నీటి సంఘాలకు పూర్తిగా కొత్త. తొలుత ఈ పదవికి కాట్రేనికోన డీసీ ఆకాశం శ్రీనివాస్‌ పేరు తెర పైకి వచ్చింది. గతంలో డీసీగా పనిచేసిన అనుభవం కూడా ఉండడంతో పాటు సామాజిక సమీకరణాల్లో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. శుక్రవారం రాత్రి వరకూ శ్రీనివాస్‌ పేరు వినిపించగా, రాజోలు, పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యేలు దేవ వరప్రసాద్‌, గిడ్డి సత్యనారాయణ పట్టుబట్టి పి.గన్నవరం డీసీ గబ్బుల శ్రీనివాస్‌ను ఎంపిక చేయించారు. రాజోలు నుంచి సొంత పార్టీకి చెందిన పినిశెట్టి బుజ్జి ఉన్నప్పటికీ సామాజిక సమీకరణల పేరుతో ఆయనను పక్కన పెట్టారు. ఆకాశం శ్రీనివాస్‌ను వైస్‌ చైర్మన్‌ పదవికి ఎంపిక చేసి పంపించారు. అయితే అమరావతి నుంచి వచ్చిన జాబితాలో శ్రీనివాస్‌ స్థానంలో కరుటూరి నర్శింహరావు పేరు రావడం గమనార్హం. ఈయన సైతం నీటి సంఘాలకు కొత్త. లోకేష్‌ ద్వారా చెప్పించుకుని తెర పైకి రావడంతో శ్రీనివాస్‌కు మొండిచేయే ఎదురైంది.

గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ) డీసీ మురాలశెట్టి సునీల్‌ కుమార్‌ (జనసేన) ఎంపిక కాగా, వైస్‌ చైర్మన్‌గా అనపర్తి డీపీ తమలంపూడి సుధాకర్‌రెడ్డి (టీడీపీ) ఎన్నికయ్యారు. వీరిద్దరూ నీటి సంఘాలకు కొత్త కావడం విశేషం. ఈ ప్రాంతంలో కొమరిపాలెం, కోటిపల్లి, కూళ్ల డీసీలుగా ఎంపికైన కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, దాట్ల వెంకట రాజగోపాలరాజు, మేకా శివ ప్రసాద్‌లకు గతంలో నీటి సంఘాల్లో పని చేసిన అనుభవం ఉంది. కొత్తగా ఎన్నికై నవారికి ఆ అనుభవం కూడా లేకపోవడం గమనార్హం.

ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా బస్వా

పెద్దాపురం: స్థానిక ఏలేరు ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్యాలయంలో శనివారం ఏలేరు ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు నిర్వహించారు. కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన బస్వా వీర వెంకట నాగేంద్ర (టీడీపీ) చైర్మన్‌గా, పిఠాపురానికి చెందిన ఊటా ఆదివిష్ణు (జనసేన) వైస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీని పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) చైర్మన్‌ తుమ్మల రామస్వామి అభినందించారు.

దాట్ల మాటకు దక్కని ప్రాధాన్యం

తన పరిధిలో మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ పదవి వచ్చేలా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆకాశం శ్రీనివాస్‌కు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవి రాకపోవడంతో పాటు తన నియోజకవర్గం పరిధిలో తాళ్లరేవు డీసీ వేగేశ్న భాస్కరరాజుకు తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్‌ చైర్మప్‌ పదవికి పట్టుబట్టినా ఫలితం లేకపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement