రత్నగిరికి భక్తుల తాకిడి
ఫ సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
ఫ దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవదంపతులు కూడా వారి బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి వచ్చారు. వీరందరూ వ్రతమాచరించి సత్యదేవుని దర్శించుకున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది.
ఘనంగా ప్రాకార సేవ
ఆలయ ప్రాంగణంలో సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు తిరుచ్చి వాహనంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేయించి, అర్చకులు పూజలు చేశారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి ప్రాకార సేవను ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో నాలుగు దిక్కులా కొబ్బరి కాయలు కొట్టి ప్రాకార సేవ కొనసాగించారు.
తరువాత స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, తిరిగి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సత్యదేవుడిని, అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఘనంగా ఊరేగించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment