పంచాయతీ తీర్మానం లేకుండా పనులా?
కొత్తపల్లి: గ్రామాల్లో అభివృద్ధి పనులను గ్రామ పంచాయతీ తీర్మానం, పాలకవర్గ సభ్యుల అనుమతులు లేకుండా చేపడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని గొల్లప్రోలు మండలం తాటిపర్తి సర్పంచ్ కట్ట బుల్లేశ్వరరావు, ఉప సర్పంచ్ దాసం వెంకటేష్ అన్నారు. గ్రామంలో పాలకవర్గ సభ్యులకు తెలియకుండా జరుగుతున్న పనులపై సోమవారం ఎంపీడీవో, ట్రైనీ కలెక్టర్ భావనకు ఫిర్యాదు అందించారు. గ్రామంలో ప్రజలకు ఉనయోగపడే పనులు చేపట్టడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సన్న కారు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే గోకులం షెడ్ల లబ్ధిదారులను పాలకవర్గం తీర్మానం లేకుండా ఎలా ఎంపిక చేశారో పరిశీలించాలని కోరారు. రెండు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం పోస్టును భర్తీ చేయాలని కోరారు.
పీజీఆర్‌ఎస్‌కు 434 అర్జీలు
కాకినాడ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (పీజీఆర్‌ఎస్)కు అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆయన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్వో జె వెంకటరావు, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, సీపీవో పి త్రినాధ్ తదితర అధికారులతో హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు వంటి అంశాలకు చెందిన మొత్తం 434 అర్జీలు అందాయి.
శృంగార వల్లభుడికి
రూ.28.43 లక్షల ఆదాయం
పెద్దాపురం: స్వయంభూ తొలి తిరుపతి శృంగార వల్లభ స్వామి ఆలయానికి అన్నదానం, హూండీల ద్వారా 28,43,967 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం దేవాదాయ శాఖ కాకినాడ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ వి.ఫణీంద్రకుమార్, గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి పీఆర్‌కేఎస్, గ్రామ సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి సమక్షంలో హుండీలను తెరిచారు. 93 రోజులకు హుండీల ద్వారా రూ.21,69,272, అన్నదానం హుండీ ద్వారా రూ.6,74.695 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment