జీతాలకు గ్రీన్ సిగ్నల్
కాకినాడ క్రైం: జీజీహెచ్‌లోని శాంక్షన్డ్ పోస్టుల్లో చోటు చేసుకున్న అక్రమాల్లో పావులుగా మారిన 2021 రిక్రూట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగులకు సాంత్వన చేకూరింది. గత నెల జీతాలు అందక ఇబ్బందిపడ్డ వారి వేదనకు ఉపశమనం లభించింది. ఏపిఎన్‌జీవో నేతల చొరవతో వారి జీతాల చెల్లింపునకు ఖజానా శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు మంగళవారం జీతాల బిల్ పాస్ అయింది. మంగళవారం ఏపీఎన్‌జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేతలు ట్రెజరీ అధికారులను కలిశారు. ఎస్‌టీవో సోమయాజులుకు. డీడీ కె.శ్రీనివాసులుకు సమస్య విన్నవించారు. శాంక్షన్డ్ పోస్టుల్లో చోటు చేసుకున్న అవినీతితో ఎటువంటి సంబంధం లేని వందల మంది ఉద్యోగులు చర్యలకు బలవుతున్నారన్నారని చెప్పారు. శాంక్షన్డ్ పోస్టుల్లో అవినీతికి పాల్పడిన అధికారి, అతడి ద్వారా లబ్ధి పొందిన 12 మంది వల్ల 190 మంది ఉద్యోగులు గత నెల జీతాలు రాక విలవిలలాడుతున్నారన్నారు. పండుగ వేళలు, జీతాలపై ఆధారపడి బతుకుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల స్థితిని పరిగణించాలని విన్నవించారు. పసుపులేటి శ్రీనివాస్ ఆయన బృందం వినతి మేరకు సానుకూలంగా స్పందించిన అధికారులు జీజీహెచ్ డీడీ నుంచి అండర్ టేకింగ్ లెటర్ తీసుకున్నారు. అనర్హులకు జమ అయితే తిరిగి ఖజానాకు చలానా రూపంలో బదలాయించే బాధ్యత తమదేననే హామీ తీసుకున్నారు. ఆ వెంటనే జీతాల బిల్ పాస్ చేశారు. వచ్చే నెల 1వ తేదీ తర్వాత గత నెల జీతంతో పాటు ఈ నెల జీతం ఉద్యోగులు అందుకోనున్నారు. ఖజానా శాఖ అధికారులను కలిసిన వారిలో ఏపిఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ్మోహన్, కార్యదర్శి పేపకాయల వెంకట కృష్ణ, ఉపాధ్యక్షుడు పాలపర్తి మూర్తిబాబు, సిటీ అధ్యక్షుడు ఏ.సత్తిరాజు, ట్రెజరీ జిల్లా అధ్యక్షుడు పాము శ్రీనివాస్ ఉన్నారు.
జీజీహెచ్ ఉద్యోగులకు ఉపశమనం
ఏపీ ఎన్‌జీవో నేతల చొరవతో
జీతాల చెల్లింపునకు అనుమతి
Comments
Please login to add a commentAdd a comment