కరెంట్ చార్జీల బాదుడుపై పోరుబాట
కాకినాడ రూరల్: కరెంట్ చార్జీల బాదుడుపై వైఎస్సార్ సీపీ పోరుబాట కార్యక్రమం ద్వారా డిసెంబరు 27న సామాన్యులకు అండగా కూటమి సర్కార్‌పై నిరసనలు చేపట్టబోతున్నట్టు ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పోరుబాట కార్యక్రమం పోస్టర్లను కాకినాడ వైద్యనగర్‌లోని పార్టీ కార్యాలయం వద్ద నాయకులతో కలిసి మంగళవారం ఆయన ఆవిష్కరించారు. కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి వినియోగదారులపై భారం వేయడంతో తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో అన్ని నియోజవకర్గాలలో శుక్రవారం ర్యాలీలు నిర్వహించి, విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతామన్నారు. ఎన్నికల సభల్లో సీఎంగా జగన్ ఎక్కువ విద్యుత్ చార్జీలు పెంచినట్టుగా చంద్రబాబు ప్రచారం చేయడంతో పాటు తాము అధికారంలోకి వచ్చిన తరువాత చార్జీలు తగ్గిస్తామని పదే పదే చెప్పేవారన్నారు. దుర్మార్గంగా అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే రూ.15,485 కోట్ల భారాన్ని మోపబోతున్నారన్నారు. పేద, ఎస్సీ, ఎస్టీ, ప్రతి వినియోగదారుడు భారాన్ని మోయవల్సిన పరిస్థితి తీసుకువచ్చారన్నారు. గతంలో బాకీలు ఉన్నాయని ఇప్పుడు వసూలు చేస్తున్నారని, దానికోసం దళిత వాడల్లో వినియోగదారుల ఇళ్ల నుంచి మీటర్ల ఫ్యూజులు పట్టుకుపోతున్నారన్నారు. వారు చీకట్లో మగ్గిపోవాలా అని ప్రశ్నించారు. 27న చేపట్టబోయే నిరసన కార్యక్రమాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కౌడా మాజీ చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, కాకినాడ సిటీ పార్టీ నాయకుడు సుంకర విద్యాసాగర్, కరప మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు, సీనియర్ నాయకుడు పుల్ల కోటేశ్వరరావు, పార్టీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు అల్లి రాజబాబు, బ్రహ్మనందం, కృష్ణంరాజు పాల్గొన్నారు.
పోస్టరు ఆవిష్కరించిన వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
27న అన్ని నియోజకవర్గాల్లోని
విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసనలు
Comments
Please login to add a commentAdd a comment