ఓఎన్జీసీ పరిహారం పంపిణీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమలాపురం: ‘‘చంద్రబాబు రావాలి... మత్స్యకార పరిహారం అందించాలి’ అని రోజుల తరబడి కాలయాపన చేస్తున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), అధికార యంత్రాంగం ఎట్టకేలకు దిగి వచ్చారు. ఇప్పుడప్పుడే సీఎం చంద్రబాబు వచ్చే పరిస్థితి లేకపోవడానికి తోడు లబ్ధిదారుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో తప్పనిసరి పరిస్థితుల్లో పరిహరం అందించేందుకు సిద్ధమయ్యారు. ఓఎన్జీసీ సంస్థ పరిహారాన్ని కలెక్టర్‌కు అందజేసి నెలలు గడుస్తున్నా, చంద్రబాబు కోసం పంపిణీ చేయకుండా చూస్తున్నారు. ఈ విషయంపై ఈ నెల 23న ‘సాక్షి’లో ‘పరిహారానికి కాలయాతన’ అనే శీర్షికతో వార్త వెలుగులోకి విషయం తెలిసిందే. దీనితో దిగివచ్చిన జిల్లా యంత్రాంగం ఈ నెల 28వ తేదీన ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు (కాకినాడ జిల్లా) కోరంగిలో ఓఎన్జీసీ పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రాకున్నా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర గనులు,ఆబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మంగళవారం ధ్రువీకరించారు.
రెండు జిల్లాల పరిధిలో..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలోని కేజీ బేసిన్‌లో ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల వేట కోల్పోయి, నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం అందించాల్సి ఉంది. కోనసీమ జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 54 గ్రామాలకు చెందిన 16,408 మంది మత్స్యకారులకు ఐదున్నర మాసాలకు గాను ఒక్కొక్కరికి రూ.11,500 చొప్పున రూ.63,250 ఇవ్వాలి. మొత్తం రూ.103,78,00,600 ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని 15 గ్రామాలకు చెందిన 7,050 మత్స్యకారులకు రూ.44,59,12,500ను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
అధికారులతో సమావేశం
తాళ్లరేవు మండలం కోరంగిలో ఈ నెల 28న ఓఎన్జీసీ పరిహారం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. రెండు జిల్లాలకు చెందిన మత్స్యశాఖ అధికారులు, ఆర్డీవోలు, డీఎస్పీలు, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.
భరోసా లేనట్టేనా?
సముద్ర వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా పంపిణీపై ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఓఎన్జీసీ పరిహారంతో పాటు మత్స్యకార భరోసా సొమ్ములు తమ ఖాతాలలో పడతాయని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వేట కోల్పోయిన మత్స్యకార కుటుంబానికి ఏడాదికి రూ.పది వేలు చొప్పున పరిహారంగా అందించింది. 2023–24 ఏడాదికి 9,821 మందికి రూ.9,82,10,000 జమ చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి 11,305 మంది లబ్ధిదారులను గుర్తించింది. ఎన్నికల సమయంలో మత్స్యకార భరోసాను రూ.20 వేలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ విధంగా చూస్తే ఈ ఏడాది మత్స్యకార భరోసా రూ.22.61 కోట్లు అందించాల్సి ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ హామీలను కొండెక్కించినట్టుగానే మత్స్యకార భరోసాకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపినట్టేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తీరంలో భద్రతను
మెరుగుపర్చాలి
అమలాపురం రూరల్: సముద్ర తీర ప్రాంత భద్రతను మరింత మెరుగుపరిచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. విశాఖపట్నం కోస్టల్ సెక్టార్ పోలీస్ అడిషనల్ ఎస్పీ మధుసూదనరావు, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు, కోస్ట్ గార్డ్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర ప్రాంతంలోని మేకనైజ్డ్ బోట్లకు ట్రాన్స్‌ఫండర్స్ కమ్యునికేషన్ వ్యవస్థను అమర్చాలన్నారు. తద్వారా భద్రత, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. సముద్ర ప్రాంతంలో నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పెట్రోలింగ్ కార్యక్రమాలను బలోపేతం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment