దైవ కుమారునికి సుస్వాగతం
● క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం
● లోక రక్షకుని రాకడ కోసం
ఊరూవాడా ముస్తాబు
● వెలుగులు విరజిమ్ముతున్న చర్చిలు
● ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు
● క్రీస్తు సందేశాలను స్మరించుకుంటూ
పులకరిస్తున్న క్రైస్తవులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): క్రిస్మస్ వేడుకలు బుధవారం ఆనందోత్సాహాలతో నిర్వహించుకొనేందుకు ఊరువాడా ముస్తాబయ్యాయి. కరుణామయుని పుట్టిన రోజు వేడుకలు మనసారా నిర్వహిస్తూ, పునీతులయ్యేందుకు క్రైస్తవ సోదరులు ఎంతో ఉత్సహంగా ఉన్నారు. దీంతో క్రైస్తవులు ఇంట పండగ వాతావరణం నెలకొంది. ప్రతి చర్చిని ప్రత్యేకంగా అలంకరించి మంగళవారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు.
స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్
లోక రక్షకుడైన ఆ క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా జరిగే సంబరాలు అన్నీ ఇన్నీ కావు. క్రైస్తవులకు ఈ నెల రోజులు హాలిడే సీజన్, సీజన్ ఆఫ్ గివింగ్ జరుపుకుంటారు. ప్రభువు రాకడను సూచిస్తూ క్రైస్తవులు ఇప్పటికే తమ ఇళ్లలో కాంతులు ప్రసరించేలా స్టార్‌లు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ట్రీలు అలకరించారు. బాల ఏసు పశువుల పాకలో పుట్టిన దృశ్యాన్ని ఇళ్లు, చర్చిల్లో బొమ్మల రూపంలో అందంగా రూపొందించారు. కాకినాడ జిల్లాలో 1,500కు పైగా పెద్ద చర్చిలు, 3 వేలకుపైగా చిన్న చర్చిలు ఉన్నాయి. లూథరన్ , బాప్టిస్ట్, రోమన్ కేథలిక్, మన్నా మిషన్, బైబిల్ మిషన్, బెయోర్షబా, ఏసు ప్రేమాలయం తదితర క్రైస్తవ శాఖల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కేంద్రమైన కాకినాడలో క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి, సెయింట్ లూథరన్ చర్చి, గాంధీనగర్‌లోని హౌస్ ఆఫ్ ప్రేయర్, ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి, జగన్నాథపురంలోని చర్చి స్కేర్ సెంటర్‌లోని రోమన్ కేథలిక్ చర్చి, ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలు ఎంతో అందంగా ముస్తాబు చేశారు. బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పిఠాపురంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, తుని ఆంధ్రా బాప్టిస్ట్, చర్చి, నాసా చర్చిలు, పెద్దాపురంలోని లూథరన్ చర్చి, బైబిల్ మెషీన్, బాప్టిస్ట్ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గోకవరంలోని సెయింట్ జాన్స్ లూథరిన్ చర్చి, ఈహెచ్‌హెచ్ చర్చి, ఏలేశ్వరంలో పట్టణంలోని లూథరన్, ఆర్‌సీఎం, సీఓఎం చర్చిల్లో వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు ప్రత్యేక ఆరాధన
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని చర్చిల్లో బుధవారం ఉదయం 9.30 నుంచి 12.30 వరకూ ప్రత్యేక ఆరాధన నిర్వహిస్తారు. ఈ సందర్భంగా క్రిస్మస్ సందేశం అందించడానికి ప్రత్యేక ఆతిథులను ఆహ్వానిస్తారు. ప్రత్యేకంగా క్రిస్మస్ గీతాలు ఆలపించి కేక్ కట్ చేస్తారు. కొన్ని చర్చిల్లో క్రీస్తు వెలుగుకు గుర్తుగా కొవ్వొత్తులు వెలిగించి క్యాండిల్ సర్వీస్ నిర్వహిస్తారు. క్రీస్తు వెలుగు కలిగి ఉంటామని చర్చిల్లో ప్రమాణం చేస్తారు. క్రైస్తవ సోదరులు, సోదరీమణులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటారు. క్రిస్మస్ కానుకలు పంచుకొంటారు.
Comments
Please login to add a commentAdd a comment