అర్జీలకు సంతృప్తికర పరిష్కారం
అధికారులకు జేసీ సూచన
కాకినాడ సిటీ: ప్రజా విజ్ఞాపన పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) ద్వారా అందిన అర్జీలపై సంతృప్తికరమైన పరిష్కారాలను అందించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా అధికారులను కోరారు. మంగళవారం కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాలులో పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్వో జె.వెంకట్రావు, సీపీవో పి.త్రినాథ్ అధికారులకు జిల్లాలో పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కార ప్రగతి, మరింత మెరుగైన పరిష్కార సేవలు అందించేందుకు జిల్లా అధికారులు చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. పీజీఆర్‌ఎస్ ర్యాంకింగ్ ప్రధానంగా ఐదు పరిమితుల ఆధారంగా నిర్ణయిస్తారన్నారు. ప్రజల నుంచి అందిన అర్జీల సంఖ్య, నిర్దిష్ట కాలపరిధిలో పరిష్కరించిన అర్జీల సంఖ్య, అర్జీదారులకు సంతృప్తితో అందించిన నాణ్యమైన పరిష్కార సంఖ్య, ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలపై పరిష్కారాలు, వాటిలో సంతృప్తినందించిన పరిష్కారాలు అనే అంశాల ఆధారంగా జిల్లాలకు ర్యాంకింగ్ ఇస్తారన్నారు. జిల్లాలో పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కార స్థాయి 62.7 శాతంగా ఉందన్నారు. ఆర్డీవోలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, డీఎల్‌డీవో కె వాసుదేవరావు, డీఆర్వో వెంకట్రావు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment