పంటల బీమా కుంపటి
ఇదీ లెక్క..
ఇప్పుడైతే బీమా కంపెనీ లెక్కించిన పంట విలువలో రెండు శాతం ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవాలి. పసల్‌బీమా యోజన ద్వారా గతంలో 1.5 శాతం రైతు చెల్లిస్తే, 0.5 శాతం ప్రీమియం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెల్లించేవి. ప్రీమియం సమాచారం కొరవడటం, రుణాల విడుదలలో జాప్యంతో చాలా మంది రైతులు ప్రీమియం చెల్లించే పరిస్థితి లేదు. విపత్తులతో పంట దెబ్బతిన్నప్పుడు పంటల బీమా వర్తించక నష్టపోవాల్సిందే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరాావృతం అవుతుందని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఎకరాకు పంట విలువ రూ.41,000లో ప్రీమియంగా రెండు శాతం మొత్తం రూ.820 బీమా కంపెనీకి చెల్లించాలి. దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 0.5 శాతం వాటా అంటే రూ. 205 చెల్లిస్తే, మిగిలిన 1.5 శాతం మేర రూ.615 రైతులే చెల్లించాలి. జిల్లాలోని 2.15 లక్షల ఎకరాల్లో రబీ సాగుకు సమాయత్తమవుతున్న రైతులపై ప్రీమియం రూపంలో రూ. 13.16 కోట్లు భారం పడింది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రబీకి సమాయత్తమవుతోన్న రైతుల గుండెలపై పంటల బీమా కుంపటై కూర్చుంది. ప్రీమియం చెల్లించకుండా ఏ ఒక్క రైతుకు బీమా వర్తించని దయనీయ పరిస్థితుల్లోకి కూటమి సర్కార్ నెట్టేసింది. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చే సమయానికి కూటమి సర్కార్ కొలువుదీరడం, వరుస ప్రకృతి విపత్తులు జిల్లాలో రైతుల కొంప ముంచాయి. బీమా దక్కాలంటే ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియంగా చెల్లించకుండానే ఉచిత పంటల బీమాను అమలు చేసింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ రైతుల పక్షపాతిగా జగన్‌మోహన్‌రెడ్డి 2019–2024 మధ్య ప్రతి రైతుకు ఉచిత పంటల బీమా వర్తింపచేశారు. రైతుల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుందని, వారు ఇన్సూరెన్స్ లావాదేవీలు జరపలేరనే ముందుచూపుతో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేసి అన్నదాతల నెత్తిన పాలుపోసిందని చెప్పొచ్చు. నిత్యం వ్యవసాయ పనుల్లో క్షణం తీరికలేకుండా ఉండే రైతులు సకాలంలో ప్రీమియం చెల్లించలేరనేది మరో కారణం. ఆర్థికంగా కూడా రైతుకు భారం కాకూడదనే నాడు సీఎం జగన్ ప్రీమియం చెల్లించనక్కరలేకుండా ఉచిత పంటల బీమా అమలు చేశారు. ఫలితంగా గడచిన ఐదేళ్లు వరుసగా రెండు పంటలకు ఉచిత పంటల బీమాతో లబ్ధి పొందారు.
ధీమాగా నిలిచిన ఉచిత పంటల బీమా
సాగులో రైతుకు ధీమానిస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకానికి కూటమి సర్కారు మంగళం పాడింది. రైతులే ప్రీమియం చెల్లించుకోవాలని స్పష్టం చేసింది. ఎకరాకు రైతు చెల్లించాల్సిన ప్రీమియం వాటా రూ.615. ఈ రకంగా జిల్లాలో ఉన్న రైతులపై ప్రీమియం భారం రూ.13.16 కోట్లు ఉంటుంది. ఇలా గడచిన ఐదేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రీమియం రూపంలో జిల్లాలో రైతుల తరఫున బీమా కంపెనీలకు రూ.296.38 కోట్లు చెల్లించింది. రైతులందరికీ ఉచిత పంటల బీమా వర్తింప చేసిన జగన్ ప్రభుత్వ పుణ్యాన జిల్లాలో విపత్తులతో పంటలు నష్టపోయిన 1,40,642 మంది రైతులు రూ.965.19 కోట్ల బీమా పరిహారాన్ని అందుకున్నారు. వర్షాలు, వరదలతో పంట నష్టం వాటిల్లిన ప్రతిసారి జిల్లాలో 90శాతం మంది రైతులను ఉచిత పంటల బీమాతో వైఎస్సార్ సీపీ సర్కారు ఒడ్డున పడేసింది.
ప్రీమియం చెల్లింపే
రైతుకు గుదిబండ
మరచిపోతే నష్టపోవాల్సిందే
దగా చేసిన కూటమి సర్కార్
ఉచితానికి కూటమి మంగళం
చెప్పిన మాటలకు చేసే పనులకు పొంతన లేని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కక్ష కట్టినట్టుగా ఉచిత పంటల బీమాకు మంగళం పాడారు. రైతులకు పెట్టుబడి సాయం రూ.20వేలు ఇస్తామని గద్దెనెక్కి ఆరు నెలల పాలన పూర్తి అయినా అతీగతీ లేకుండా చేశారు. ఉచిత పంటల బీమా ఎత్తేసి రైతులపై పెద్ద పిడుగుపడేశారు. ఉచిత పంటల బీమాలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే భరించేది. ఈ రబీ సీజన్‌కు సంబంధించి పాత పద్ధతిన ప్రీమియం రైతులే చెల్లించాల్సి వస్తోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, వాణిజ్య బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే సందర్భంలోనే రైతుల నుంచి ప్రీమియం జమ చేసుకుంటాయి. కాబట్టి పంట రుణాలు తీసుకునే రైతుల పంటలు ప్రకృతి విపత్తులతో దెబ్బతింటే బీమా పరిహారం లభిస్తుంది. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్‌లలో 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వరి సాగుచేసే రైతులు సుమారు రెండు లక్షల వరకు ఉంటారని అంచనా. ఇందులో డీసీసీబీ పరిధిలోని వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా పంట రుణాలు తీసుకునే రైతులు 60 వేల మంది ఉంటారు. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతులు 20 నుంచి 30 వేల మంది ఉంటారని వ్యవసాయశాఖ అంచనా. ఈ 90 వేల మంది రైతులకు రుణాలు ఇచ్చే సందర్భంలోనే బ్యాంకులు ప్రీమియం జమ చేసుకుంటాయి. ఏరకంగాను పంట రుణాలు తీసుకోని మిగిలిన లక్ష పైబడి రైతుల పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. గడచిన ఐదేళ్లూ పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రకృతి విపత్తులప్పుడు పంటలు నష్టపోతే బీమా పరిహారం దక్కాలంటే ప్రీమియం చెల్లించాల్సిందే. ఐదేళ్ల తరువాత ఈ రబీ సీజన్ నుంచి ప్రీమియం చెల్లింపు భారాన్ని కూటమి సర్కార్ రైతులపై నెట్టేసింది. ఇందుకు గడువు కూడా ఈ నెల 31 వరకే ఉండటంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
31వ తేదీలోపు ప్రీమియం చెల్లించండి
రైతులు పంటల బీమా కోసం ప్రీమియం చెల్లింపులు ఈ నెల 31వ తేదీ లోపు పూర్తి చేయాలి. గడువు మీరాక ప్రీమియం చెల్లించేందుకు వీలుండదు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పంటల బీమా లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయాన్ని రైతులు గుర్తించి ప్రీమియం త్వరగా చెల్లించాలి.
– విజయ్‌కుమార్,
జిల్లా వ్యవసాయశాఖాధికారి, కాకినాడ
మినహాయింపు ఇవ్వాలి
గత ఖరీఫ్‌లో వరుసగా వచ్చిన విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరదలతో పంటలు పూర్తిగా మునిగిపోయి సన్న, చిన్నకారు రైతులతోపాటు పెద్ద రైతులు ఆర్థికంగా చితికిపోయారు. రైతులపై ఏ మాత్రం అభిమానం ఉన్నా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇవ్వాలి. పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తానని గొప్పగా ప్రకటించిన చంద్రబాబు అండ్ కో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటిపోయినా ఇంతవరకు రైతుల ఖాతాలకు రూ.20 కూడా వేయలేదు. రైతులను నిలువునా మోసం చేసి ఇప్పుడు ఉచిత పంటల బీమాకు మంగళం పాడారు. రైతుల నెత్తిన ప్రీమియం భారం మోపేందుకు చంద్రబాబుకు మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. రైతు పక్షపాతి అయిన జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా గడచిన ఐదేళ్లూ క్రమం తప్పకుండా ఉచిత పంటల బీమా అమలు చేశారు.
– కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment