ఇచ్చుకోండి.. ఓ కోటి
● ఐదేళ్ల కిందటే అర కోటి ఇచ్చారు..
● ఇప్పుడూ అంతేనా!
● మద్యం వ్యాపారులకు
కూటమి నేతల డిమాండ్
● ‘కిక్’ కావాలంటే అడిగినంతా
ఇవ్వాల్సిందేనని పట్టు
● కొలిక్కి రాని బేరసారాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘మీరు ఏం చేస్తారో తెలీదు. కచ్చితంగా కోటి రూపాయలు కట్టాల్సిందే. ఎప్పుడో ఐదేళ్ల క్రితమే అర కోటి ఇచ్చారు. ఇప్పుడు కూడా అలానే అంటే ఎలా?’ అని కూటమి నేతలు డిమాండ్ చేస్తూంటే..
‘అప్పటి మాదిరిగా ఇప్పుడు వ్యాపారాలు సాగడం లేదు. అంతయితే ఇవ్వలేం. అందులో సగం అయితే మాకు ఓకే. ఆ అర కోటి అయినా ఇవ్వాలంటే బాటిల్‌పై రూ.10 పెంచుకుంటాం. పక్కనున్న మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో బాటిల్‌పై అదనంగా రూ.10 పెంచేందుకు ఒప్పందం కుదిరింది కదా! అలానే ఇక్కడ కూడా అనుమతించి అన్నీ చూసుకోవాలి. అలా మీకు సమ్మతమైతే అగ్రిమెంట్ చేసుకుందాం’ అని మద్యం వ్యాపారులు బేరసారాలు చేసుకుంటున్నారు.
జిల్లా కేంద్రమైన కాకినాడలో మద్యం వ్యాపారులకు, కూటమి ప్రజాప్రతినిధుల మధ్యవర్తులకు మధ్య పక్షం రోజులుగా ఈ తరహా సంప్రదింపులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కాకినాడ నగరం, రూరల్ నియోజకవర్గాల్లో కేటాయించిన మద్యం దుకాణదారులను ఒక సిండికేట్‌గా చేసేందుకు గతంలో జరిగిన ప్రయత్నాలు ఫలించ లేదు. చివరకు ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్నారు. అలా ఎవరికి వారు వ్యాపారం వారు చేసుకుంటూ పోతే తామేమైపోవాలని నియోజకవర్గ ముఖ్య నేతలకు ఆలోచన వచ్చింది. అంతే.. మద్యం వ్యాపారుల వద్దకు తమ అనుచరులను రాయబారానికి పంపించారు. సిటీ, రూరల్ నియోజకవర్గాల నుంచి ముగ్గురు ద్వితీయ శ్రేణి నేతలు.. మద్యం వ్యాపారులతో ఈ చర్చలు జరిపారు. వ్యాపారుల తరఫున ముగ్గురు, ముఖ్య నేతల ప్రధాన అనుచరులు ఈ సంప్రదింపుల్లో పాల్గొన్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారానికి కాకినాడ కుళాయి చెరువు సమీపాన ఉన్న ఒక ప్రముఖ హోటల్ వేదికై ంది. ఇరు పక్షాల మధ్య ఇప్పటికే రెండు పర్యాయాలు చర్చలు జరిగాయి. ఇంతవరకూ బేరం మాత్రం కుదరలేదు.
రూ.కోటి ఇస్తామంటేనే చర్చలు
కాకినాడ సిటీలో 36 మద్యం షాపులు, 8 బార్‌లు, కాకినాడ రూరల్‌లో 12 మద్యం దుకాణాలు, 3 బార్‌లు నడుస్తున్నాయి. మొత్తం రెండు నియోజకవర్గాలు కలిపి మొత్తం 48 మద్యం దుకాణాలు, 11 బార్‌లు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించే ఎకై ్సజ్ శాఖకు ప్రతి నెలా రూ.10 లక్షలు సమీకరించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయం అలా ఉండగా.. సిటీ, రూరల్ నియోజకవర్గాల ముఖ్య నేతల విషయంపై ఇరు పక్షాల చర్చల్లో పలు ప్రతిపాదనలు వచ్చాయి. మద్యం షాపులు, బార్లకు లైసెన్స్ పొందిన కాలానికి సంబంధించి సిటీలో ముఖ్య నేతకు రూ.కోటి ఇవ్వాలని పట్టుబట్టినట్టు విశ్వసనీయ సమాచారం. అలాగైతేనే చర్చలకు రావాలని, లేదంటే వద్దని ఆయన ప్రతినిధులు కరాఖండీగా చెప్పారని తెలియవచ్చింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడే తమ నేతకు రూ.50 లక్షలు ఇచ్చారని, దీనికి రెట్టింపు ఇస్తేనే చర్చలు ముందుకు వెళతాయని ఒకింత గట్టిగానే చెప్పారని అంటున్నారు. దీనికి సై అంటేనే భవిష్యత్‌లో ఏ సమస్య వచ్చినా భుజాన వేసుకుంటామని, అలా కాకుంటే మీ ఇష్టమని చెప్పేశారని సమాచారం. రూరల్ నియోజకవర్గ ప్రతిపాదనలను ఇందులో చొప్పించవద్దని, ఇది పూర్తిగా సిటీకి సంబంధించినదని, తమ నేత సీనియర్ అని స్పష్టం చేయడంతో వ్యాపారుల ప్రతినిధులు కంగు తిన్నారు.
అంత ఇచ్చుకోలేం..
ప్రస్తుతం వ్యాపారాలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయని, అందువలన అంత పెద్ద మొత్తంలో ఇవ్వడం తమ వల్ల కాదని వ్యాపారుల ప్రతినిధులు స్పష్టంగా చెప్పారని తెలిసింది. రూ.3 లక్షలు ఆపైన వ్యాపారం జరిగే దుకాణాలు రెండు నియోజకవర్గాల్లో కలిపి 10కి మించి లేవని, మిగిలిన వాటిలో లావాదేవీలు రూ.2 లక్షలకు మించి జరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అటువంటప్పుడు అంతంత భారీ నజరానాలు ఎలా ఇచ్చుకోగలమని వారి ప్రతినిధులు చెప్పడంతో తొలి విడత చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.
అ‘ధనం’ వసూలుకు అంగీకరించండి
ముఖ్య నేతలకు డిమాండ్ మేరకు ఇవ్వాలంటే ఒక్కో మద్యం బాటిల్‌పై అదనంగా రూ.10 వసూలు చేసుకునే ప్రతిపాదనను వ్యాపారుల ప్రతినిధులు రెండో దఫా భేటీలో తెర మీదకు తీసుకువచ్చారు. మండపేట, కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో అదనంగా వసూలు చేసి, అమ్ముకునేందుకు అనుమతించారని, అదేవిధంగా ఇక్కడ కూడా అనుమతిస్తే రూ.కోటి డిమాండుపై ఆలోచిస్తామని స్పష్టం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ఏ విషయమూ తేలకపోవడంతో మరోసారి భేటీ కావాలనే నిర్ణయానికి వచ్చి, చర్చలకు ముగింపు పలికారు. ఏమవుతుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment