రత్నగిరి కిటకిట
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. ఉదయం నుంచీ భక్తులు సత్యదేవుని దర్శనానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు కిక్కిరిసిపోయాయి. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 1,200 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదా యం సమకూరింది. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది భోజనం చేశారు. ఈ నెల రెండో తేదీన ప్రారంభించిన డిజిటల్ పేమెంట్స్ కౌంటర్‌కు భక్తుల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా భక్తులు శనివారం 175 వ్రతాల టిక్కెట్లు, రెండు కల్యా ణం టికెట్లు కొనుగోలు చేశారు. దీని ద్వారా రూ. 1,80,080 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. స్వామివారి ప్రత్యేక దర్శనం టికెట్టు రూ. 200 విక్రయాలతో రూ.5,800 ఆదాయం వచ్చిందన్నారు.
ఘనంగా ప్రాకార సేవ
ఆలయ ప్రాంగణంలో సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు తిరుచ్చి వాహనంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు వేంచేయించి, పూజలు చేశారు. అనంతరం కొబ్బరి కాయ కొట్టి ప్రాకార సేవ ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో నాలుగు దిక్కులా కొబ్బరి కాయలు కొట్టి సేవను కొనసాగించారు. తదనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, తిరిగి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథ సేవను ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment