శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో వెలసిన స్వయంభూ శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలో రద్దీ ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 7 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల టికెట్లు, కేశఖండన, అన్నదాన విరాళాల రూపంలో దేవస్థానానికి రూ.1,28,743 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.
కొనసాగిన వలంటీర్ల దీక్షలు
కాకినాడ సిటీ: ఏపీ గ్రామ, వార్డు వలంటీర్ల సంఘం ఆధ్వర్యాన వలంటీర్లు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. ఈ శిబిరాన్ని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలనే డిమాండు నెరవేర్చుకునేందుకు అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. వలంటీర్ల భుజంపై తుపాకీ పెట్టి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేసే ఎత్తుగడను టీడీపీ నాయకులు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా వలంటీర్లందరికీ రూ.10 వేల వేతనం చెల్లించాలని, అందరినీ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పండగ రోజుల్లో కూడా వలంటీర్లను పస్తులతో గడిపేలా చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని శేషుబాబ్జీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, కోశాధికారి మలకా రమణ, వలంటీర్ల సంఘం జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు ప్రకాష్, వరుణ్‌కుమార్, సతీష్, వరలక్ష్మి, కె.దుర్గా తదితరులు పాల్గొన్నారు.
వ్రత పురోహితుడి సస్పెన్షన్
అన్నవరం: సత్యదేవుని వ్రతాలాచరిస్తున్న భక్తులను దానాలు ఇవ్వాలని ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలపై రెండో తరగతి వ్రత పురోహితుడు అల్లంరాజు అచ్యుత్ భగవాన్‌ను సస్పెండ్ చేస్తూ అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల రెండో తేదీన వ్రతం ఆచరించిన తనను ఆ వ్రత పురోహితుడు కానుకలు అడిగినట్టు ఓ భక్తుడు ఫిర్యాదు చేయడంతో ఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులను ఇబ్బంది పెడితే తీవ్ర చర్యలుంటాయని ఆయన పురోహితులను హెచ్చరించారు.
నైపుణ్యాభివృద్ధిలో
ఉచిత శిక్షణ
కాకినాడ సిటీ: జిల్లాలోని ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధికి వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.సునీల్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, యూనిఫాం, భోజనం, స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నామన్నారు. అర్హులైన వారు ‘మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయం, డోర్ నంబర్ 11–1–29, శ్రీ పద్మా టవర్స్, రామారావుపేట, కాకినాడ’ చిరునామాలో దరఖాస్తులు అందజేయాలని సునీల్ కుమార్ కోరారు.
దేహదారుఢ్య పరీక్షల్లో
పాల్గొన్న అభ్యర్థినులు
కాకినాడ క్రైం: కాకినాడలోని పోలీస్‌పరేడ్ మైదానంలో శనివారం కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రక్రియ జరిగింది. 320 మంది మహిళా అభ్యర్థినులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. వీరిలో 203 మంది అభ్యర్థినులు తదుపరి పరీక్షలకు అర్హులయ్యారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ పరీక్షలను నేరుగా పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment