క్యాన్సర్ సేవల్లో మరో మెట్టు
● కాకినాడ జీజీహెచ్‌లో క్యాన్సర్ ఐసీయూ, పాలియేటివ్ కేర్
సేవలు ప్రారంభం
● డాక్టర్ పేర్రాజు దినవహి జ్ఞాపకార్థం బ్యాచ్‌మేట్లు, కుటుంబీకుల వితరణ
● డయాలసిస్ యూనిట్‌లో
ఆర్‌ఓ ప్లాంటు ఏర్పాటు
కాకినాడ క్రైం: జీజీహెచ్‌లో క్యాన్సర్ ఐసీయూతో పాటు పాలియేటివ్ కేర్ (ఉపశమన సంరక్షణ) సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. రంగరాయ వైద్య కళాశాలలో 2001 బ్యాచ్ (థండర్స్)కు చెందిన డాక్టర్ పేర్రాజు దినవహి అత్యుత్తమ వైద్య సేవలతో భారత కీర్తిని అమెరికాలో విస్తరించారు. 2021లో క్యాన్సర్ బారిన పడి గతేడాది ఆగస్టు 24న మరణించిన ఆయన జ్ఞాపకార్థం.. కుటుంబీకులు, బ్యాచ్‌మేట్లు జీజీహెచ్‌లో రూ.9 లక్షలతో ప్రత్యేక క్యాన్సర్ ఐసీయూ ఏర్పాటు చేశారు. 6 పడకలతో పాటు 6 మల్టీ పారా మానిటర్లు, రెండు ఏసీలు, ఎనిమిది ఆక్సిజన్ పాయింట్లు, ఏర్పాటు చేసి క్యాన్సర్ బాధితుల ప్రాణాలకు భరోసా కల్పించారు. ఐసీయూ ఏర్పాటు ప్రక్రియలో 2001 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ తేజోకృష్ణ, డాక్టర్ ఫణి కీలకంగా వ్యవహరించారు. ఆంకాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ పద్మనాభన్ శ్రీనివాసన్ చొరవ చూపారు.
కీమో థెరపీ తీసుకుంటున్న వారికి వరం
కీమోథెరపీ ఆధారిత క్యాన్సర్ బాధితులకు క్యాన్సర్ ఐసీయూ వరంగా మారనుంది. క్యాన్సర్ చికిత్సలో భాగమైన కీమోథెరపీ రోగి స్థితిని మరింత దుస్థితిలోకి నెడుతుంది. హైఎండ్ కీమోథెరపీ తీసుకుంటున్న బాధితులకు తెల్లరక్తకణాల సంఖ్య క్షీణిస్తుంది. జ్వరం, వాంతులు, విరేచనాలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ స్థితిని వైద్య పరిభాషలో ఫెబ్రాయిల్ న్యూట్రోపీనియా అంటారు. ఈ స్థితిలో క్యాన్సర్ బాధితుడికి ప్రాణాపాయం వాటిల్లే అవకాశం ఉంది. అటువంటి వారికి ఈ ఐసీయూలో అందించే వైద్య సేవ అపర సంజీవనిగా నిలుస్తుంది. త్వరలో ఈ వార్డు మొత్తాన్ని పూర్తి స్థాయి ఐసీయూగా మార్చే ప్రణాళిక సిద్ధం చేసినట్టు హెచ్‌ఓడీ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటివరకూ రోగికి ఐసీయూ అవసరమైతే మరో డిపార్ట్‌మెంట్ ఐసీయూకి తరలించాల్సి వచ్చేది. ఆ డిపార్ట్‌మెంట్‌లో క్యాన్సర్ నిపుణులు ఉండేవారు కాదు. ప్రత్యేక ఐసీయూ ఏర్పాటుతో ఆ కష్టాలకు అడ్డుకట్ట పడింది. రోగి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా నాలుగైదు రోజుల పాటు ఐసీయూ వైద్య సేవలు అందిస్తారు. జీజీహెచ్ ఆంకాలజీ ఓపీ భవంతిలో పాలియేటివ్ కేర్ ఓపీ కూడా ఏర్పాటు చేశారు. క్యాన్సర్‌తో ఆరోగ్యపరంగా, మానసికంగా వేదన అనుభవిస్తున్న రోగులకు ఇక్కడ ఉపశమన చికిత్స లభిస్తుంది. ఇందుకు ఓ ప్రత్యేక వైద్యుడుని, రోగులకు ఓ సహాయకురాలిని నియమించారు. కనీసం రోజుకు 5 నుంచి 10 మంది ఈ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. అలాగే మెడికల్ వార్డులోని గౌండ్ ఫ్లోర్‌లో ఉన్న డయాలసిస్ యూనిట్ ద్వారా కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందుతున్నాయి. రక్షిత జలాలతో డయాలసిస్ చేస్తే మరింత ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు యూనిట్ పై అంతస్తులో ప్రత్యేకించి డయాలసిస్ కోసం ఓ ఆర్‌వో ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సేవలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ ఓపీ ఆవరణలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హెచ్‌ఓడీలు డాక్టర్ యశోదమ్మ, డాక్టర్ అనురాధ, డిప్యూటీ కలెక్టర్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, హెచ్‌డీఎస్ సభ్యుడు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, ఆంకాలజీ నిపుణులు కర్రా ప్రదీప్, నరసింహులు, రామ్మోహన్, రామ్‌కోశా నుంచి డాక్టర్ ఆనంద్, డాక్టర్ గౌతమ్ ప్రవీణ్, డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
ఐసీయూ ఏర్పాటుతో క్యాన్సర్ రోగులకు మరింత నాణ్యమైన సేవలు అందనున్నాయని రేడియేషన్ ఆంకాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ పద్మనాభన్ శ్రీనివాసన్ చెప్పారు. దాతలు మరింతగా సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment