కబళించిన కంటైనర్
ఫ మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం
ఫ దంపతులు సహా కుమార్తె దుర్మరణం
ఫ కుమారుడి పరిస్థితి విషమం
ఫ మిత్రుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా విషాదం
ఫ మృతులు కాకినాడ జిల్లా వాసులు
మేడ్చల్ రూరల్: ప్రమాదానికి గురై, ఆపదలో ఉన్న వారిని పరామర్శించేందుకు వెళ్తున్న ఓ కుటుంబంలోని ముగ్గురిని కంటైనర్ వాహనం కబళించింది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం..
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా యర్రవరం గ్రామానికి చెందిన సాగి బుల్లబ్బాయ్ (35), భార్య లావణ్య (25), కుమార్తె హర్షితాదేవి (8), కుమారుడు సిద్ధేశ్వర్(6)తో కలిసి బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చి ఉప్పల్ ప్రాంతంలో ఉంటున్నారు. బుల్లబ్బాయ్ ఉదయం పూట ఇడ్లీ (టిఫిన్లు) అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాకినాడ ప్రాంతానికే చెందిన బుల్లబ్బాయ్ స్నేహితుడైన జోక వెంకటేశ్వరరావు కుటుంబం మేడ్చల్ మండలం ఎల్లంపేట్ గ్రామంలో నివాసం ఉంటూ టిఫిన్ల వ్యాపారం చేస్తోంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వరరావు భార్య చేతికి ఫ్రాక్చర్ అయింది. వారిని పరామర్శించేందుకు బుల్లబ్బాయ్ కుటుంబ సభ్యులు నలుగురూ కలసి తమ మోపెడ్‌పై ఆదివారం ఉప్పల్ నుంచి ఎల్లంపేట్ వెళ్తున్నారు. మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపాన వారి వాహనాన్ని వెనక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొంది. దీంతో మోపెడ్‌పై ఉన్న బుల్లబ్బాయ్, ఆయన భార్య లావణ్య, కూతురు హర్షితాదేవి, కుమారుడు సిద్ధేశ్వర్ రోడ్డుపై పడిపోయారు.
వారిపై నుంచి కంటైనర్ దూసుకుపోవడంతో దంపతులతో పాటు కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. సిద్ధేశ్వర్ రెండు కాళ్లూ నుజ్జునుజ్జయ్యాయి. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment