ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం
కాకినాడ సిటీ: ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తోందని, పొమ్మనలేక పొగబెట్టే చందంగా ఈ పథకానికి నిధుల కోత విధిస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జల్లి విల్సన్ విమర్శించారు. కాకినాడలోని వ్యవసాయ కార్మిక సంఘం భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అప్పలరాజు అధ్యక్షతన ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందామని విల్సన్ పిలుపునిచ్చారు.
నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్
కాకినాడ సిటీ: కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులందరూ విధిగా పాల్గొనాలని ఆదేశించారు. మండల స్థాయిలో జరిగే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులందరూ ఉదయం 9.30 గంటలకే హాజరు కావాలని పేర్కొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. సంఘ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ పసుపులేటి హరిరామప్రసాద్, ఉపాధ్యక్షుడిగా వీవీవీబీ కృష్ణప్రసాద్, కార్యదర్శిగా బి.చక్రవర్తి, కోశాధికారిగా ఎం.వసంతలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని వివిధ కళాశాలల అధ్యాపకులు అభినందించారు. ఎన్నికల అధికారిగా కె.వెంకట్రావు వ్యవహరించారు. అధ్యాపకుల సమస్యలపై పోరాడటంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలుగు మీడియం ప్రవేశపెట్టడానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం పేర్కొంది.
సత్యదేవునికి పట్టు వస్త్రాల సమర్పణ
అన్నవరం: సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సంక్రాంతి పండగ నాడు అలంకరించేందుకు గాను విశాఖపట్నానికి చెందిన శ్రీరామ్‌తేజ్ దంపతులు రూ.90 వేల విలువైన పట్టు వస్త్రాలను ఆదివారం సమర్పించారు. 15 పట్టు పంచెలు, 15 పట్టు చీరలను దేవస్థానం ఈఓ వి.సుబ్బారావుకు అందజేశారు. దాత కోరిక మేరకు ఈ వస్త్రాలను సంక్రాంతి వేడుకల్లో స్వామి, అమ్మవార్లకు అలంకరించాలని అర్చకులను ఈఓ ఆదేశించారు. ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకుడు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
సాగర సాహసికి హర్యానా గవర్నర్ అభినందన
సామర్లకోట: విశాఖ నుంచి కాకినాడ వరకూ వారం రోజుల పాటు బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈది, ఘనత సాధించిన సామర్లకోటకు చెందిన గోలి శ్యామలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం ఫోనులో అభినందించారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి కై లాస్ నాగేష్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న శ్యామలకు దత్తాత్రేయ ఫోన్ చేసి సముద్రం ఈతలో కష్టాలు అడిగి తెలుసుకున్నారు. సముద్రాలను ఈదడం హాబీగా ప్రారంభించిన శ్యామల గతంలో శ్రీలంక – భారత్ మధ్య రామసేతు వద్ద సముద్రాన్ని అలవోకగా ఈదారన్నారు. అలాగే, లక్షద్వీప్ వద్ద తన ప్రతిభ ప్రదర్శించారని పేర్కొన్నారు. సాహసాలకు వయస్సుతో సంబంథం లేదనే విషయాన్ని శ్యామల నిరూపించారని, భవిష్యత్తులో మరిన్ని సాహసాలు కొనసాగించాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment