టీడీపీ ఆరోపణలు అవాస్తవం
● అభివృద్ధికి కాదు అవినీతికి వ్యతిరేకం
● మున్సిపల్ చైర్‌పర్సన్ సుధారాణి
తుని: పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశామని గర్వంగా చెప్పుకునే ఘనత తమకు ఉందని తుని మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీలో అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నామని మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ చేసిన ఆరోపణలు అవాస్తమని కొట్టి పారేశారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో సీపీ సుధారాణి, కౌన్సిలర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. సుధారాణి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ మర్రా సత్యవతి గుండె పోటుతో చనిపోతే నివాళులు అర్పించేందుకు కౌన్సిల్ సమావేశం వాయిదా వేశామని, అదే రోజు అధికారులు కలెక్టర్ అనుమతి ఉందని చెప్పి అన్న క్యాంటీన్ ప్రారంభించారన్నారు. కౌన్సిల్ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. తర్వాత సమావేశంలోని అజెండాలో ఆరేళ్ల క్రితం చేసిన పనులకు సంబంధించిన బిల్లులు, టెండర్ పిలవకుండా పనులు చేసి బిల్లులు పెట్టిన విషయంలో వ్యతిరేకించామన్నారు. రాజ్యాంగంలో పొందు పరిచిన నిబంధనలను అధికారులు పట్టించుకోక పోవడంపై సమావేశంలో అడిగినా సరైన సమాధానం చెప్పక పోవడంపై ప్రశ్నించామన్నారు. బెల్లపు వీధిలో కల్వర్టు నిర్మాణానికి కౌన్సిల్ తీర్మానం చేసిందని, పండగను దృష్టిలో పెట్టుకుని పనులను తాత్కాలికంగా వాయిదా వేశామని, అధికారులు రోడ్డును తవ్వి వదిలి వేయడంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో పట్టణంలో 100 సీసీ రోడ్లు, గణపతినగర్ మోడల్ పార్కు, రాజా రాజబాబు పార్కులో స్కేటింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామని, ఇది టీడీపీ నాయకులు కనిపించక పోవడం దురదృష్టకరమన్నారు.
ఎన్నికలకు ముందు ఉప్పరగూడెంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సొంత నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును తామే చేశామని చెప్పుకున్న టీడీపీని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో అవుట్ సోర్కింగ్‌లో పని చేస్తోన్న కార్మికులను కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో తొలగించారన్నారు. కౌన్సిలర్లు షేక్ క్వాజా, కర్రి సత్య జగదీష్ మాట్లాడుతూ గడిచిన మూడేళ్లలో ప్రజలు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వలేదా? ఇప్పుడు ఇస్తే ఎందుకు కౌన్సిల్ అజెండాలో పెడుతున్నారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజుపేట జగనన్న కాలనీలో పేదలకు ఇచ్చిన పట్టాలు మున్సిపల్ కార్యాలయంలో ఉండి పోయాయని వీటిని లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదో కమిషనర్ వెంకట్రావు చెప్పాలన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అవినీతికి వ్యతిరేకమన్నారు. కౌన్సిలర్లు చింతల సునీత, రేలంగి విజయ దుర్గ, అల్లాడ దివాణం, ఏలూరి బాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment