గోలి శ్యామలను అభినందించిన కలెక్టర్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): విశాఖపట్నం నుంచి కాకినాడ వరకూ బంగాళాఖాతంలో వారం రోజులపాటు 150 కిలోమీటర్లు ఈది ఘనత సాధించిన సామర్లకోటకు చెందిన గోలి శ్యామలను సోమవారం కలెక్టర్ షణ్మోహన్ సగిలి సత్కరించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా విశాఖలో మొదలుపెట్టి ఈదుకుంటూ విజయవంతంగా కాకినాడకు చేరుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు అభినందనలు తెలియజేశారు. సముద్రాలను ఈదడం హాబీగా పెట్టుకున్న ఆమె ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.
అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. అర్జీలకు ఆయా శాఖల అధికారులు సత్వరం సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలన్నారు. రెవె న్యూ, పింఛను, బియ్యం కార్డులు మంజూరు, ఉ ద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, ఆక్రమణలు తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడి కల తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ల మంజూరు వంటి అంశాలు 339 అర్జీలు అందాయన్నారు. శాఖల వారీగా అర్జీల వివరాలు ఎప్ప టికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.
పోలీస్ స్పందనకు 49 ఫిర్యాదులు
కాకినాడ క్రైం: కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం స్పందన నిర్వహించారు. ఎస్‌పి విక్రాంత్ పాటిల్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 49 ఫిర్యాదులు అందాయని ఎస్‌పి తెలిపారు.
సాక్షి సీనియర్ సబ్ ఎడిటర్ ప్రభాకరరావు మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సాక్షి సీనియర్ సబ్ ఎడిటర్ జ్యోతుల ప్రభాకరరావు (59) సోమవారం మృతిచెందారు. రాజమహేంద్రవరంలోని జేఎన్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన బొల్లినేని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. తల వెనుక రెండు బలమైన గాయాలు కావడం, తల లోపల రక్తం అధికంగా స్రవించడంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఐసీయూలో వైద్య చికిత్సలు నిర్వహించినా పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందారు. నాలుగు దశాబ్దాల పాటు రిపోర్టర్‌గా, డెస్క్‌లో సబ్ ఎడిటర్‌గా ప్రభాకరరావు సేవలు అందించారు. కాకినాడలో తొలుత స్థానిక పత్రిక సర్కార్ ఎక్సప్రెస్‌లో రిపోర్టర్‌గా ప్రభాకరరావు పాత్రికేయ జీవితం ఆరంభించారు. విజయవాడలో ఆంధ్రజ్యోతి, రాజమహేంద్రవరంలో వార్తలో సబ్ ఎడిటర్‌గా పని చేశారు. సాక్షి ప్రారంభం నుంచి రాజమహేంద్రవరం యూనిట్‌లో ఆయన పనిచేశారు. ఆయన మొక్కల ప్రేమికుడు. తీరిక వేళల్లో మినీ నర్సరీని నడుపుతూ, అందరితో సరదాగా, స్నేహా పూర్వ కంగా, ఆత్మీయంగా మెలిగేవారు. ప్రస్తుతం ఆ నర్సరీనీ ఆయన కుమారుడు నిర్వహిస్తున్నాడు. మృతిచెందిన ఆయన భౌతికకాయాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మంగళవారం ఉదయానికి ఆ కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అనంతరం కోటిలింగాల శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన మృతికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి, ఏపీయూడబ్ల్యూజే స్టేట్ సెక్రటరీ ఎం.శ్రీరామమూర్తి, ప్రెస్‌క్లబ్ సభ్యులు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. పాత్రికేయులందరూ ఉదయం 10 గంటలకు ప్రభుత్వాసుపత్రికి చేరుకోవాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment