10న రత్నగిరిపై ముక్కోటి వేడుకలు
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని సన్నిధిన ఈ నెల 10వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్బంగా తెల్లవారుజామున ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు ఉత్తర ద్వారదర్శనం ద్వారా భక్తులను అనుమతించనున్నట్లు దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. ముక్కోటి ఏర్పాట్లపై ఆయన సోమవారం దేవస్థానం వైదిక కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఆరోజు సత్యదేవుని ప్రధానాలయంలో దక్షిణ ద్వారం వద్ద ఉత్తర అభిముఖంగా మండపాన్ని ఏర్పాటు చేసి అందులో శేషపాన్పుపై పవళిస్తున్న విష్ణుమూర్తి, లక్షీదేవి ఉత్సవమూర్తులను ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లకు పంచ హారతి, నీరాజన మంత్రపుష్పాలు సమర్పిస్తారు. అనంతరం ఉదయం ఐదు గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించేందుకు భక్తులను అనుమతిస్తారని తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్లను వెండి రథంపై ప్రాకారంలో ఊరేగిస్తారు. రాత్రి ఏడు గంటల నుంచి వెండి గరుడ వాహనంపై గ్రామంలో స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారని తెలిపారు. డీసీ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రామ్మొహన్‌రావు, వైదిక కమిటీ సభ్యులు వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠీ, గంగాధరబట్ల గంగబాబు, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితుడు, పురోహిత సంఘం అధ్యక్షుడు ఛామర్తి కన్నబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment