అంబరాన్ని తాకేలా..
ఫ రత్నగిరిపై సంక్రాంతి సంబరాలు ప్రారంభం
ఫ భోగి మంటతో ప్రారంభించిన
తపోవనం స్వామీజీ
ఫ ఆలయ ప్రాంగణంలో
ఉట్టిపడిన గ్రామీణ సంస్కృతి
అన్నవరం: సత్యదేవుడు కొలువైన రత్నగిరిపై సంక్రాంతి సంబరాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రత్నగిరి రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలను పండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ తుని తపోవనం ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామీజీ ఉదయం ఆరు గంటలకు భోగి మంట వెలిగించి ప్రారంభించారు. అనంతరం తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుతో కలసి తిలకించారు. స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో ప్రతిష్ఠించిన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూర్తులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ తెలుగు సంస్కృతికి సంక్రాంతి ప్రతీక అని అన్నారు. పాడిపంటలు, పశుపోషణతో పెనవేసుకున్న మన సంస్కృతిని, అనుబంధాలను ఏటా గుర్తు చేసే అపురూపమైన పండుగ అని చెప్పారు. అచ్చ తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా దేవస్థానంలో చేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. ఏటా ఇదే విధంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, ఉప ప్రధానార్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, పవన్, సుధీర్, శర్మ, పరిచారకులు యడవిల్లి చిన్నా తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఏఈఓ కొండలరావు, పీఆర్‌ఓ కృష్ణారావు తదితరులు ఏర్పాట్లు చేశారు.
పల్లె వాతావరణం ఉట్టిపడేలా..
సంక్రాంతి సంబరాల్లో భాగంగా అచ్చ తెలుగు పల్లె వాతావరణాన్ని తలపించేలా రత్నగిరిపై చేసిన ఏర్పాట్లు అందరినీ అలరించాయి. ఒకవైపు పొంగలి వంట, ఇంకోవైపు భోగి మంట, పాడి ఆవులు, తెలుగు పౌరుషానికి ప్రతిరూపంగా నిలిచే కోడి పుంజులు, పొట్టేళ్లు, ఎడ్ల బండి, భోగి పండ్లు, బొమ్మల కొలువు, తాటిచెట్టు, కొబ్బరిచెట్టు వంటి ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. వీటితో పాటు సంప్రదాయ జానపద కళారూపాలైన గంగిరెద్దుల వాళ్లు, కొమ్మదాసరి, హరిదాసు, కళాకారుల కోలాట నృత్యాలతో ఆలయ ప్రాంగణం శోభాయమానంగా దర్శనమిచ్చింది. దీనికి తోడు స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి, భక్తులు దర్శించే అవకాశం కల్పించారు. వేడుకల ప్రాంగణంలో కొలను.. దాని వెనుక సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి ఉత్సవమూర్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ అలంకరణల వద్ద ఫొటోలు దిగడానికి చాలా మంది భక్తులు పోటీ పడ్డారు. సత్యదేవుని పూజల్లో నిత్యం బిజీగా గడిపే దేవస్థానం ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు సుధీర్, పవన్ తదితరులు కాస్త ఆటవిడుపుగా ట్రాక్టర్ నడుపుతున్నట్టు ఫొటోలు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment