కొక్కొరొకో.. కోఢీ
ఫ కూటమి నేతల బరితెగింపు
ఫ యథేచ్ఛగా కోడిపందేలు
ఫ విచ్చలవిడిగా గుండాటలు.. జూదాలు
ఫ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఒప్పందాలు
ఫ రూ.లక్షలు పలికిన గుండాట బోర్డులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతి పండగ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని.. కోడి పందేలకు, జూద క్రీడలకు దూరంగా ఉండాలని.. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ పోలీసు యంత్రాంగం కొన్ని రోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ ఆఫ్ట్రాల్ అన్నట్టుగా ఆ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయని పందేలరాయుళ్లు.. అధికార కూటమి నేతల అండతో.. తమకు అడ్డే లేదన్నట్టుగా ‘బరి’ తెగించేశారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో షరా మామూలుగానే పందెం కోడి కాలు దువ్వింది.. కత్తి కట్టించుకుని.. తగ్గేదేలే అన్నట్లుగా బరిలో తలపడింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. మూడు రోజుల సంక్రాంతి పండగల్లో తొలి రోజయిన భోగి నాడే కోడి పందేలు, గుండాట, పేకాట, లాటరీ, జూదం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన కోడిపందేలు, గుండాటల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మొదటి స్థానంలో నిలవగా కాకినాడ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం సుమారు 350 బరుల్లో కోడి పందేలు జరిగాయని అంచనా. ఇందులో కోనసీమ జిల్లాలోనే అత్యధికంగా 110 బరుల్లో కోడి పందేలు జరిగాయి. ఈ ప్రాంతంలో తొలి రోజు రూ.110 కోట్లుపైనే పందేలు జరిగాయని లెక్కలేస్తున్నారు.
పత్తా లేని పోలీసులు
సంక్రాంతికి రెండు రోజులు ముందు పోలీసులు హడావుడి చేశారు. కోడిపందేలు, గుండాటలు ఆడితే కటకటాల్లో వేస్తామని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రైవేటు లే అవుట్లలో కోడి పందేలకు సిద్ధం చేస్తున్న బరులు, టెంట్ల వంటి వాటిని పీకేశారు. తీరా చూస్తే ఈ పండగల్లో మొదటిదైన భోగి నాడే ఎక్కడికక్కడే కోడిపందేలు, గుండాటలు బహిరంగంగానే మొదలైపోయాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు పత్తా లేకుండా పోయారు. కూటమి ప్రజాప్రతినిధుల ఆదేశాలు.. ఆయా పార్టీల నేతల కనుసన్నల్లో పందేలరాయుళ్లతో ముందస్తుగా కుదిరిన ఆర్థికపరమైన ఒప్పందాలు పోలీసులను కట్టడి చేశాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీ సెట్టింగ్‌లు, ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌ను తలపించేలా గ్యాలరీలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో కోడి పందేలు నిర్వహించినా పోలీసు యంత్రాంగం మొత్తం చోద్యం చూస్తూ మిన్నకుండిపోయింది.
కూటమి నేతల అండదండలతో..
అధికార కూటమిలోని టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు, మాజీలు, ఆ పార్టీ నేతల సమక్షంలో పందేలరాయుళ్లు చేసుకున్న ఒప్పందాలు రూ.కోట్లలోనే ఉన్నాయని అంటున్నారు. సంక్రాంతి పండగ మూడు రోజులు కోడి పందేలకు అనుమతులున్నాయంటూ పందేలరాయుళ్లు బరి తెగించారు. కూటమి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల స్వీయ పర్యవేక్షణలోనే కోళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు జరిపించారు. కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచే కోడిపందేలు, గుండాటలు హోరెత్తాయి.
కోనసీమ జిల్లాలో..
ఫ అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, రామచంద్రపురం తదితర నియోజకవర్గాల్లో కోడిపందేలతో పాటు గుండాట బోర్డులు విచ్చలవిడిగా నిర్వహించారు.
ఫ ఐ.పోలవరం మండలం మురమళ్లలో 10 ఎకరాల ప్రైవేటు లే అవుట్‌లో మూడు బరులు ఏర్పాటు చేసి మరీ భారీ హంగామాతో కోడిపందేలు, గుండాటలు జరిపించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద సహా కూటమి నేతల సమక్షంలోనే కోడిపందేలు జరిగాయి. వీటిని వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్లు, క్రికెట్ టోర్నమెంట్ మాదిరి గ్యాలరీలు, వీఐపీలకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్క మురమళ్ల బరుల్లోనే రూ.25 కోట్లు పైగా కోడిపందేలు జరిగాయని అంటున్నారు. గుండాటలో ఆరితేరిన పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన నిర్వాహకుడు ఇక్కడి గుండాట బోర్డును వేలంలో రూ.80 లక్షలకు పాడుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సంక్రాంతి మూడు రోజులూ గుండాట ద్వారా రూ.2 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెంట్లు, గ్యాలరీ, ఎల్‌ఈడీల ఏర్పాటులో చేయి తిరిగిన హైదరాబాద్‌కు చెందిన కంపెనీతో రూ.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. పండుగ మూడు రోజులు ఇక్కడి బరుల్లో రూ.75 కోట్లు పైనే పందేలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పందేల దరిదాపుల్లోకి పోలీసులు రాకుండా ఉండేందుకు రోజుకు రూ.10 లక్షల వంతున మూడు రోజులకు రూ.30 లక్షలకు ఒప్పందం జరిగిందని విశ్వసనీయంగా తెలిసింది.
ఫ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో 14 బరులు ఏర్పాటయ్యాయి. ఇక్కడ తొలి రోజు సుమారు రూ.3 కోట్ల మేర పందేలు జరిగాయని అంచనా. కూటమి నేతలు కోడిపందేల కంటే గుండాట బోర్డులు ఎక్కువగా నిర్వహిస్తున్నారు.
కాకినాడ జిల్లాలో..
ఫ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతలు బరి తెగించి మరీ నిస్సిగ్గుగా పార్టీ పరంగా కోడిపందేలు నిర్వహించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ సంప్రదాయం ముసుగులో దగ్గరుండి మరీ పిఠాపురం పట్టణంలో కోడిపందేలు ఆడించారు. నియోజకవర్గంలోని పిఠాపురం, వాకతిప్ప, పి.దొంతమూరు, గొల్లప్రోలుల్లో టీడీపీ, జనసేన నేతలు పార్టీల పేరుతో వేర్వేరుగా బరులు ఏర్పాటు చేసి, రూ.కోట్లలో పందేలు హోరెత్తించారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 30 బరులు ఏర్పాటైనట్టు లెక్క తేల్చారు.
ఫ కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు బోట్‌క్లబ్ పార్క్‌లో సంప్రదాయం పేరుతో కోడి పందేలు ప్రారంభించారు. కూటమి నేతల కనుసన్నల్లోనే కాకినాడ రూరల్, కరప మండలాల్లో విచ్చలవిడిగా పందేలు జరుగుతున్నాయి. కాకినాడ రూరల్ తిమ్మాపురం, సర్పవరం గ్రామాల్లో జరుగుతున్న పందేలు రూ.7 కోట్ల వరకూ ఉంటాయని అంచనా వేస్తున్నారు. కరపలో మూడు రోజుల పాటు నిర్వహించే 60 పందేల్లో ఎక్కువ గెలిచిన వారికి బహుమతిగా రూ.25 లక్షల విలువైన తార్‌జీపు.. గురజనాపల్లి, గొర్రిపూడి బరుల్లో 4 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లను బహుమతులుగా ఇచ్చేందుకు సిద్ధం చేశారు. మూడు రోజుల పందేల అనంతరం విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. టీడీపీ, జనసేన విడివిడిగా బరులు ఏర్పాటు చేయగా, తొలి రోజే రూ.కోటికి పైనే చేతులు మారినట్లు అంచనా. కరప మండలంలోని కొన్ని గ్రామాల్లో టీడీపీ, కొన్ని గ్రామాల్లో జనసేన కోడిపందేలు నిర్వహించుకునేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఒక్కో బరికి రూ.లక్ష వంతున పోలీసులకు ముట్టజెప్పారని అంటున్నారు.
ఫ ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పందేలు జరుగుతున్నాయి. కోడిపందేలకు ప్రసిద్ధి చెందిన వేట్లపాలెంలో ఇటీవల జరిగిన మూడు హత్యల నేపథ్యంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ కోడిపందేలకు చెక్ పడింది. మొదటి రోజున పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో రూ.2 కోట్ల వరకూ పందేలు జరిగాయి.
ఫ తుని నియోజకవర్గంలో సుమారు రూ.50 లక్షల మేర కోడిపందేలు, గుండాటలు జరిగాయి.
ఫ జగ్గంపేట మండలంలోని 8 బరుల్లో రోజుకు రూ.80 లక్షల వరకూ కోడి పందేలు జరుగుతున్నాయి. గోకవరం మండలం కృష్ణునిపాలెం, గోకవరం, మల్లవరం, కొత్తపల్లి గ్రామాల్లో కోడిపందేలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఒక్కో బరికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ పాటలు జరిగాయి. గోకవరంలో రూ.50 లక్షలు పైనే పలికింది. కిర్లంపూడి, వేలంక, తామరాడ, గ్రామాల్లో పెద్ద బరుల్లో తొలి రోజు రూ.60 లక్షలు, గండేపల్లి మండలంలోని 13 బరుల్లో రూ.30 లక్షల చొప్పున పందేలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment