నాలుగెకరాల్లో మామిడి తోట దగ్ధం
తొండంగి: మండలంలోని కొమ్మనాపల్లిలో నాలుగుగెకరాల్లో మామిడితోట దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామ శివారులో కోన గోవిందు, కోన రాంబాబు, కోన వెంకటరావు, కుర్రా పెదకాపు, కుర్రా రాంబాబు, కుర్రా సత్తిబాబు, కుర్రా నాగబాబులు ఎన్నో ఏళ్లుగా నాలుగెకరాల్లో మామిడి తోటలు సాగు చేసుకుంటున్నారు. వీరి తోటలకు సమీపాన పక్క గ్రామానికి చెందిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తరచుగా వైర్లు తగులబెడుతూ, వాటి నుంచి వచ్చిన రాగిని ముద్దగా కరిగించి తీసుకుని వెళ్తున్నారు. ఆదివారం రాత్రి కూడా ఇదే విధంగా వైర్లు తగులబెట్టడంతో ఆ మంటలు క్రమంగా వ్యాపించి తమ తోటల్లోని చెట్లన్నీ మాడిపోయాయని రైతులు వాపోతున్నారు. పూత పూసిన మామిడి చెట్లన్నీ మంటలకు మాడిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు పశుగ్రాసం కోసం ఎకరం విస్తీర్ణంలో వేసిన గడ్డి, తాటిచెట్లు, ఇతర చెట్లు పూర్తిగా కాలిపోయాయని వివరించారు. దీనిపై బాధిత రైతులు తొండంగి పోలీసులకు, ఉద్యానవన శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తోటలకు దుక్కి, పూత కోసం, తెగుళ్ల నివారణకు అవసరమైన పురుగు మందుల కోసం దాదాపుగా రూ.2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టామని, చెట్లు కాలిపోవడంతో ఆ మేరకు నష్టపోయామని, జీవనాధారం కోల్పోయామని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తమ న్యాయం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment