ప్రభవించేలా..
ఫ నేటి నుంచి ప్రభల తీర్థాలు
ఫ జగ్గన్నతోటలో రేపు ఉత్సవం
ఫ ఇదే రోజు పలుచోట్ల సంబరాలు
జగ్గన్నతోటకు జాతీయ ఖ్యాతి
జగ్గన్నతోట ప్రభల తీర్థం జాతీయ స్థాయిలో గుర్తింపు సంతరించుకుంది. 2024లో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడం విశేషం. రాష్ట్ర శకటంగా దీనిని ఎంపిక చేశారు. గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులు ఈ తీర్థ విశేషాలను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్ చేశారు. తీర్థం ప్రాముఖ్యతను మోదీ అభినందించారు. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్లే రాష్ట్ర ప్రభుత్వ శకటం మీద జగ్గన్నతోట తీర్థానికి వచ్చే ఏకాదశ రుద్రులను ప్రదర్శనకు ఉంచాలని అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయించడంతో జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించినట్టయ్యింది. రిపబ్లిక్ డే పెరేడ్‌లో దర్శనమిచ్చిన ఏకాదశ రుద్రులు దేశాన్ని ఆకర్షించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ వెబ్ సైట్‌లో ఈ తీర్థానికి సంబంధించిన విశేషాలను పొందుపరిచింది.
సాక్షి, అమలాపురం/ అంబాజీపేట: పచ్చని చేలు.. కొబ్బరి తోటలు.. అందమైన పంట కాలువలు.. లోతైన మురుగునీటి కాలువలు.. వాటి మధ్య నింగిలోని ఇంద్ర ధనస్సులా కదిలాడే ప్రభలు. ఇలా ఒకేసారి అన్నింటినీ చూసేందుకు చాలవు రెండు కళ్లు. విభిన్న రంగులు.. వింతైన రూపురేఖలు.. అందమైన ఆకృతులతో 20 అడుగుల వెడల్పు.. 35 నుంచి 48 అడుగుల ఎత్తు ఉండే ప్రభలు పుర వీధుల మీదుగా గ్రామ పొలిమేరలు దాటే అరుదైన దృశ్యం చూడాలంటే కోనసీమ రావాల్సిందే. ఒకవైపు వరద గోదావరిలా పోటెత్తే భక్తులు.. మరోవైపు ఓంకార నాదాలు.. మేళతాళాలు.. బాణసంచా కాల్పులు.. ప్రభల మెడలో జే గంటల సవ్వడితో నిజమైన ఆధ్యాత్మిక అనుభూతులు పొందాలంటే కోనసీమలో జరిగే ప్రభల తీర్థాలు చూడాల్సిందే.
కోనసీమలో సంక్రాంతి నుంచి మక్కనుమ తరువాత రోజు వరకూ అన్ని మండలాల్లో ప్రభల తీర్థాలు జరుగుతుంటాయి. చిన్నా పెద్దా అన్నీ కలిపి సుమారు 84 వరకూ ప్రభల తీర్థాలు నిర్వహిస్తారని అంచనా. సంక్రాంతి రోజున జరిగే తొలి ప్రభల తీర్థం కొత్తపేటదే. అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో తీర్థం కనుమ రోజు బుధవారం జరగనుంది. మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి ప్రత్యేకత ఉంది. కనుమ రోజున జరిగే తీర్థంలో 11 గ్రామాలకు చెందిన ప్రభలు ఈ తీర్థానికి తరలివస్తాయి. మొసలపల్లి భోగేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘువేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిలు జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు జగ్గన్నతోటను ఆనుకుని ఉండే ఎగువ కౌశికను దాటుకుని వచ్చే తీరు నయనానందకరంగా ఉంటుంది. తీర్థానికి చాలా మంది ఇప్పటికీ గూడు బండ్లపై రావడం సంప్రదాయమే. ఈ తీర్థానికి 50 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు.
కాలువలను దాటుకుని..
వాకలగరువు సోమేశ్వరస్వామి, తొండవరం ఉమా తొండేశ్వరస్వామి, గున్నేపల్లి రామలింగేశ్వరస్వామి ప్రభలు 45 అడుగులు, 43 అడుగుల ఎత్తున నిర్మిస్తారు. మామిడికుదురు శివారు కొర్లగుంటలో జరిగిన ఈ తీర్థానికి సైతం అరుదైన గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రభలు పంట కాలువలు, పచ్చని పొలాల మధ్య నుంచి తరలి వస్తుంటాయి. తీర్థానికి మామిడికుదురు, నగరం, పాశర్లపూడి, ఈదరాడ, పెదపట్నం గ్రామాల నుంచి 17 ప్రభలు వస్తాయి. పెదపట్నం నుంచి 12 ప్రభలు కొర్లగుంట తీర్థానికి రావడం గమనార్హం. వీటితోపాటు అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, అయినవిల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పలుచోట్ల ప్రభల తీర్థాలు పెద్ద ఎత్తున జరుగుతాయి.
భారీగా పోలీసు బందోబస్తు
అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో ఈ నెల 15న నిర్వహించే ప్రభల తీర్థానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు ఆధ్వర్యంలో 360 మంది బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పి.గన్నవరం సీఐ వై.భీమరాజు తెలిపారు. ఏడుగురు సీఐలు, 23 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, 32 మంది హెడ్ కానిస్టేబుల్స్, 230 పోలీసులు, 80 మంది హోంగార్డులను నియమించారన్నారు. ఎస్సై కె.చిరంజీవి పర్యవేక్షణలో మొబైల్ పార్టీ లు తీర్థంలో పర్యవేక్షిస్తాయన్నారు. ప్రభల నిర్వాహకులు, పోలీసులకు భక్తులు సహకరించాలన్నారు. తీర్థంలోకి ప్రభల వెంట ఎటువంటి సినీ, రాజకీయ ఫ్లెక్సీలు, బూరలను తీసుకు రావద్దన్నారు. అలా తీసుకుని వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేడు వాహన రాకపోకల మళ్లింపు
కొత్తపేట: సంక్రాంతి ప్రభల ఉత్సవం సందర్భంగా మంగళవారం కొత్తపేట గ్రామం మీదుగా వాహన రాకపోకలు నిషేధించినట్టు ఎస్సై జి.సురేంద్ర తెలిపారు. ప్రభల ఉత్సవాలు అన్ని ప్రాంతాల్లో కనుమ పండగ (బుధవారం) రోజున జరుగుతుండగా, కొత్తపేటలో మాత్రం మకర సంక్రాంతి రోజున నిర్వహించనున్న విషయం తెలిసిందే. అందువల్ల వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకూ అమలాపురం, రావులపాలెం వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను దారి మళ్లించామని తెలిపారు. రావులపాలెం వైపు నుంచి అమలాపురం వెళ్లే వాహనాలన్నీ బోడిపాలెం వంతెన నుంచి వాడపాలెం, అయినవిల్లి, ముక్తేశ్వరం మీదుగా అమలాపురం వెళ్లాలని, అదే విధంగా అమలాపురం నుంచి రావులపాలెం వెళ్లే వాహనాలు పలివెల వంతెన నుంచి పలివెల, గంటి మలుపు, ఈతకోట మీదుగా జాతీయ రహదారికి రావాలని సూచించారు.
అట్టహాసంగా ఉత్సవాలు
జగ్గన్నతోటలో కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థంలో కొలువు తీరే ఏకాదశ రుద్రులను దర్శించుకుంటే సప్త సంతతులు కలుగుతాయి. సప్త సంతతుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త, సంతానం, కీర్తి, గృహం, ఆరోగ్యం, ఆయుష్యులు కలుగుతాయని శివ పురాణా ల్లో చెప్పబడింది. ఈ ఉత్సవాలను ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. –పుల్లేటికుర్రు సత్యనారాయణ
శాస్త్రి, అర్చకుడు, మొసలపల్లి
Comments
Please login to add a commentAdd a comment