వలలో చిక్కుకుని మత్య్సకారుడి మృతి
మామిడికుదురు: పీతల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ వలలో చిక్కుకుని గోగన్నమఠం గ్రామంలోని పల్లిపాలేనికి చెందిన మత్య్సకారుడు పెసింగి బ్రహ్మయ్య (49) మృతి చెందాడు. అతడి కుమారుడు గణేష్ ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేశామని ఏఎస్సై పి.కృష్ణ బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి చెరువులో పీతల వేటకు వెళ్లిన బ్రహ్మయ్య బుధవారం వలలో చిక్కుకుని మృతి చెంది ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు.
బొలేరో ఢీకొని
ఇద్దరికి తీవ్ర గాయాలు
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లోని పటవల వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కోరంగి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు, మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన పెసల వెంకటేష్, ప్రసాద్ కలిసి ద్విచక్ర వాహనంపై కాకినాడ వైపు నుంచి యానాం వైపు వెళుతున్నారు. అమలాపురం నుంచి కాకినాడకు వస్తున్న బొలేరో వాహనం బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో
జైలు, జరిమానా
కాకినాడ లీగల్: మద్యం తాగి బైకులు నడిపిన 11 మందికి రెండు రోజులు చొప్పున జైలు, మరో 18 మందికి జరిమానా విఽధిస్తూ కాకినాడ మూడో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వి.నరసింహారావు తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్ – 1, 2 పోలీసు స్టేషన్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వీరు పట్టుబడ్డారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపర్చగా పైవిధంగా న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment