ఫ ప్రభుత్వానికి అన్నవరం దేవస్థానం వినతి
ఫ వరుస వివాదాలు, ఆర్థిక ఇబ్బందుల
నేపథ్యంలో లేఖ
అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దత్తతను ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అన్నవరం దేవస్థానం వినతిపత్రం సమర్పించింది. అన్నవరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ దేవస్థానం నిర్వహణ తమకు కష్టసాధ్యంగా మారిందని ఆ వినతిలో పేర్కొన్నారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఈ విషయం విలేకర్లకు తెలిపారు. కాగా, ప్రస్తుతం దేవదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గతంలో అన్నవరం దేవస్థానం ఈఓగా ఉన్నప్పుడు కూడా ఇదేవిధంగా ప్రభుత్వానికి వినతి పత్రం పంపించారు. అయితే, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అప్పుడు దానిని అంగీకరించలేదు. కోరుకొండ దేవస్థానంలో జరుగుతున్న అనేక వివాదాలు అన్నవరం దేవస్థానం అధికారులకు తలనొప్పిగా మారాయి. మంచి జరిగితే ఆ దేవస్థానానికి, చెడు జరిగితే తాము పట్టించుకోవడం లేదనే అపవాదు వస్తోందని ఇక్కడి అధికారులు వాపోతున్నారు. కోరుకొండ ఆలయన నిర్వహణకు అన్నవరం దేవస్థానం ఏటా సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో కోరుకొండ దేవస్థానం నిధులు రూ.16 లక్షలు దుర్వినియోగం చేశారనే అభియోగంపై అన్నవరం దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ కె.సతీష్, రికార్డు అసిస్టెంట్ టి.అనిల్ కుమార్, కోరుకొండ దేవస్థానానికి చెందిన రికార్డు అసిస్టెంట్ టి.రవికుమార్‌లను అప్పటి ఈఓ రామచంద్ర మోహన్ సస్పెండ్ చేశారు. తరువాత ఆ నిధులు జమ చేయడంతో తిరిగి వారికి ఉద్యోగాలిచ్చారు. అయినప్పటికీ ఆ వివాదం పూర్తిగా సమసిపోలేదు. గత నెలలో కోరుకొండ దేవస్థానం కార్యాలయంలో మద్యం సీసాలు దర్శనమిచ్చాయని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై కూడా అన్నవరం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతిసారీ ఏదో ఒక వివాదం రావడం అన్నవరం దేవస్థానం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. మరోవైపు అన్నవరం దేవస్థానం ఆర్థిక ఇబ్బందుల కారణంగా గతంలో మాదిరిగా నిధులు ఖర్చు చేసే అవకాశం లేదని, అందువలన దత్తత నుంచి ఉపసంహరించాలని కోరినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment