కొత్తపేట: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి అన్నిదారుల నుంచి భక్తప్రవాహం వాడపల్లి క్షేత్రానికి ప్రవహించింది. శనివారం తెల్లవారుజామున అర్చక స్వాములు స్వామివారి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభించారు. స్వామివారిని అభిషేకాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరించి, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారితో పాటు, ఏడు వారాల నోము ఆచరిస్తున్న భక్తులతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి తమ కోర్కెలు నెరవేరాలని వేడుకున్నారు. స్వామిని దర్శించుకుని మురిసిపోయారు. ముందుగా భక్తులు గౌతమీ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అలాగే ఆలయ ఆవరణలో వేంకటేశ్వర స్వామి క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది, స్థానిక స్వామివారి సేవ వలంటీర్లు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఒక్కరోజు స్వామివారికి ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, సేవలు, లడ్డూ విక్రయం, ఆన్‌లైన్ సేవల ద్వారా రూ.33,62,453 ఆదాయం సమకూరినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బందోబస్తు నిర్వహించారు.
శనైశ్చర స్వామికి తైలాభిషేకాలు
శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసియున్న ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారికి శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తైలాభిషేకాలు జరిపారు. దేవస్థానానికి తైలాభిషేకాల ద్వారా రూ.1,22,390, అన్న ప్రసాద విరాళాలుగా రూ.27,496 వచ్చిందని దేవదాయ శాఖ డీసీ, దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు.
01ఆర్‌వీపీ61: వాడపల్లిలో వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
● వాడపల్లికి పోటెత్తిన భక్తజనం
● ఒక్కరోజే రూ.33.62 లక్షల ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment