![హంస వ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06rjc182-270081_mr-1738866837-0.jpg.webp?itok=ltV-IH7H)
హంస వాహనా.. శేష శయనా..
సఖినేటిపల్లి: అంతర్వేదిలో లక్ష్మీనృసింహుని కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం సాయంత్రం హంస వాహనంపైన, రాత్రి శేష వాహనంపై స్వామివారి గ్రామోత్సవాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. అలాగే స్వామివారి సన్నిధిలో ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు విశేష పూజలు చేశారు. తొలుత స్వామివారి సన్నిధిలో పుణ్యాహవచనం, వాస్తుపూజ, గరుత్మంతుని హోమం, అంకురార్పణ, ధూపసేవ, ధ్వజా రోహణ, గరుత్మంతుని చిత్రపటం ఆవిష్కరణ నిర్వహించారు.
ఏడు రోజుల పాటు విష్ణుదీక్ష
గురువారం నుంచి పౌర్ణమి వరకూ ఉత్సవాల నిర్వహణకు అర్చకులు ఏడు రోజులు పాటు విష్ణుదీక్ష తీసుకున్నారు. ఏటా ఈ దీక్ష చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అర్చకులకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహద్దూర్, ఉత్సవ సేవా కమిటీ ఛైర్మన్ దిరిశాల బాలాజీ దీక్షా వస్త్రాలను అందజేశారు.
భక్తి శ్రద్ధలతో అంకురార్పణ
స్వామివారి దీక్ష తీసుకున్న అర్చకులు భక్తిశ్రద్ధలతో అంకురార్పణ, ధ్వజారోహణ నిర్వహించారు. నవధాన్యాలను పుట్టమట్టిపై చల్లి, సర్వ దేవతలను ఆవాహన చేసి, ఏడు రోజుల పాటు అర్చనకు శ్రీకారం చుట్టారు. ఈ నవధాన్యాల నుంచి మొక్కలు ఎంత ఏపుగా ఎదిగితే అంతమేర గ్రామాలు పాడిపంటలతో సుభిక్షంగా ఉంటాయని పురాణ ప్రతీక.
ధ్వజారోహణ
స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సకల దేవతలకు గరుత్మంతుని ద్వారా ఆహ్వానం పలుకుతూ ధ్వజస్తంభంపై ధ్వజపటం ఎగురవేయడమే ధ్వజా రోహణ అని ప్రధాన అర్చకుడు శ్రీనివాస కిరణ్ తెలిపారు. కల్యాణ మహోత్సవాలకు దుష్ట శక్తుల వల్ల ఎటువంటి అవరోధాలు లేకుండా ఉండేందుకు కూడా ధ్వజారోహణను చేస్తామని అన్నారు. ధ్వజస్తంభానికి మామిడి ఆకులు, దర్భలను కట్టి, గరుత్మంతుని చిత్రం గీసిన వస్త్రాన్ని అర్చకులు ఎగురవేశారు.
ధవళేశ్వరం: నవ జనార్దునులలో ప్రథముడైన ధవళగిరి వాసుని కల్యాణానికి ధవళేశ్వరం సిద్ధమైంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న కల్యాణోత్సవాలు ఈ నెల 13 వరకు వైభవంగా సాగనున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిమంది రథ, కల్యాణోత్సవాలకు తరలి రానున్నారు. ఇందుకు దేవదాయ, ధర్మదాయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు స్వామివారి రథోత్సవం ప్రారంభమవుతుంది. రథంవీధి నుంచి స్థానిక పోలీస్‌స్టేషన్ వరకు రథోత్సవం కన్నుల పండగగా సాగి రాత్రి 9.30 గంటలకు కల్యాణం నిర్వహించనున్నారు. ఈ రథానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 40 అడుగులు పొడవైన రథాన్ని ఒకే చెట్టు కలపతో నిర్మించారు. గ్రామ ఆడపడుచులు ఎక్కడున్నా ఈ ఉత్సవాలకు తరలి వస్తారు. ర థంపైన కట్టే గొడుగును భక్తులు అరటిపండ్లతో కొట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆ గొడుగుకు అరటిపళ్లు తగిలితే శుభమని గ్రామస్తుల విశ్వాసం.
ధవళగిరిపై ఉన్న జనార్థన స్వామి ఆలయం
ధవళగిరిపై లక్ష్మీజనార్దనం
రేపటి కల్యాణానికి సర్వం సిద్ధం
వేలాదిగా తరలి రానున్న భక్త జనం
భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీనృసింహుడు
కనుల పండగగా గ్రామోత్సవాలు
కొనసాగుతున్న విశేష కార్యక్రమాలు
![హంస వాహనా.. శేష శయనా..1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06rzl43-270021_mr-1738866837-1.jpg)
హంస వాహనా.. శేష శయనా..
![హంస వాహనా.. శేష శయనా..2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06rzl41-270021_mr-1738866837-2.jpg)
హంస వాహనా.. శేష శయనా..
![హంస వాహనా.. శేష శయనా..3](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06rjc185-270081_mr-1738866838-3.jpg)
హంస వాహనా.. శేష శయనా..
Comments
Please login to add a commentAdd a comment