సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గుంపగుత్తగా తనకు ఓట్లు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షలు ఇస్తామని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సంఘానికి భవన నిర్మాణం చేయిస్తామంటూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టారని సదాశివపేట పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేసింది. తనపై ఆరోపణలకు ఆధారాలు లేకుండా తహసీల్దార్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, దీనిని కొట్టేయాలని కోరుతూ రవీందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె లక్ష్మణ్ ఇటీవల తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మర్కల్ విలేజ్‌లోని స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశాన్ని రవీందర్‌రెడ్డి నిర్వహించి సంఘ సభ్యులు మొత్తం ఓట్లు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేస్తే ఒకో గ్రూప్‌నకు రూ.5 లక్షలు ఇస్తామని, అధికారంలోకి రాగానే ప్రభుత్వం బిల్డింగ్ కట్టిస్తుందని ప్రలోభపెట్టారంటూ ఎమ్మార్వో ఫిర్యాదు చేశారు. దీనిపై సదాశివనగర్ పోలీసులు పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఆయన న్యాయవాది వాదించారు. ఎన్నికల షెడ్యూల్ 2018 అక్టోబర్ 6న వెలుడిన విషయం పత్రికల్లో పబ్లిష్ అయ్యిందని, ఫైనల్ ఓటర్ల లిస్ట్ అక్టోబర్ 12న రెడీ చేశారని, అక్టోబర్ 3వ తేదీ నాటికి ఎన్నికల షెడ్యూల్ అమల్లో లేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment