అకాల వర్షం.. అతులాకుతలం | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. అతులాకుతలం

Published Tue, Apr 23 2024 8:15 AM

పిట్లం మార్కెట్‌ యార్డ్‌లో వరద నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం  - Sakshi

నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం

నేలకొరిగిన భారీచెట్లు

పిట్లం(జుక్కల్‌) : మండల కేంద్రంలో, చిల్లర్గి, సిద్దాపూర్‌, రాంపూర్‌, గౌరారం, కుర్తి తదితర గ్రామాల్లో సోమవారం కురిసిన భారీ వర్షంకు వరదనీరు రావడంతో వరిపంట ధాన్యం, జొన్నపంట పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ధాన్యం నీళ్లలో కొట్టుకుపోయింది. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో అధికారులు సిబ్బందికి, సహకార సంఘం అధికారులకు ధాన్యంపై కప్పడానికి కవర్లు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు త్వరగతిన ధాన్యంను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

నిజాంసాగర్‌లో..

నిజాంసాగర్‌(జుక్కల్‌) : నిజాంసాగర్‌, మహమ్మద్‌ నగర్‌ మండలాల్లో సోమవారం సాయంత్రం కురిసిన అకాలవర్షంతో పాటు బలమైన గాలులు, ఉరుములు, మెరుపులకు ప్రజలు అతలాకుతలయ్యారు. ఒక్కసారిగా వచ్చిన గాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడటంతో పాటు ఇళ్ల పైకప్పు రేకులు లేచిపడ్డాయి. ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోసిన వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. రోడ్లపైన ఆరబెట్టిన ధాటికి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందారు.

రామారెడ్డిలో..

రామారెడ్డి : ఈదురుగాళ్లు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో మండలంలో పలు చోట్ల చెట్లు నేలకొరకగా, ఇనుపరేకులు కింద పడిన ఘటనలు సోమవారం సాయంత్రం రాత్రి చోటుచేసుకున్నాయి. రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలో భారీ చెట్లు సైతం నేలకొరకగా ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో రామారెడ్డి ఎస్సై విజయ్‌ కొండ ఆధ్వర్యంలో పోలీసులు శ్రమించి జేసీబీ సాయంతో చెట్లను తొలగించారు. ఏఎస్సై రవీందర్‌, కానిస్టేబుల్‌ పవన్‌, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రూరల్‌ పరిధిలో..

కామారెడ్డి రూరల్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లపై రేకులు కొట్టుకుపోయాయి. మిద్దె ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అరగంట పాటు కురిసిన వర్షానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

దోమకొండలో విద్యుత్‌ సరఫరా బంద్‌

దోమకొండ : మండల కేంద్రంలో సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాగా పిడుగు పడింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. గ్రామంలోని బీబీపేట్‌ రోడ్డులో అయ్యవారి రామాచారి ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెట్టు మంటలతో పూర్తిగా కాలిపోయింది, పిడుగు పడిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో గండం తప్పింది. మంటలు వస్తున్న విషయం తెలుసుకున్న ఆ ప్రాంతవాసులు కరెంటు అధికారులకు ఫోన్‌తో సమాచారం అందించడంతో గంట సేపు కరెంటును నిలిపివేశారు.

గాలులకు కొట్టుకుపోయిన షెడ్లు

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌) : మండలంలో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులకు టీకారం తండాలో 30 రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. ఈ ఏడాది వర్షాల్లేక పంటలు కొంత ఎండిపోగా, మిగితా పంట ఇలా అకాల వర్షానికి వర్షార్పణమైంది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం దాదాపుగా కొట్టుకుపోయింది.

లింగంపేటలో..

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని వర్షం నీటి నుంచి తీయడానికి రైతులు అవస్థలు పడ్డారు. అధికారులు ధాన్యం తూకం వెంట వెంటనే వేయాలని రైతులు కోరుతున్నారు. వాతావరణలో తరుచూ మార్పులతో ఆరిన ధాన్యం తూకంలో జాప్యం కారణంగా తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement