తప్పిపోయిన బాలుడి అప్పగింత | - | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన బాలుడి అప్పగింత

Published Sat, Oct 5 2024 1:36 AM | Last Updated on Sat, Oct 5 2024 1:36 AM

తప్పిపోయిన బాలుడి అప్పగింత

రుద్రూర్‌: జార్ఖండ్‌ రాష్ట్రం నుంచి తప్పిపోయి వచ్చిన పదకొండేళ్ల బాలుడు వీరకుమార్‌ను శుక్రవారం బాలల సంరక్షణ సమితి అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జార్ఖండ్‌లో వరదల కారణంగా బాలుడు తప్పిపోయి ట్రెయిన్‌లో బోధన్‌కు చేరుకున్నాడు. బోధన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు బాలుడిని పీఎస్‌కు తీసుకెళ్లిన అనంతరం సంరక్షణ నిమిత్తం కోటగిరి మండలం ఎకాస్‌పూర్‌ క్యాంపు గుమ్మడి ఫౌండేషన్‌ అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమ నిర్వాహకులు బాలుడికి బట్టలు, భోజనం అవసరమగు వసతి కల్పించారు. తెలుగు భాష రానందున బాలుడితో హిందీలో మాట్లాడుతూ.. బాలుడి తల్లితండ్రుల వివరాలు తెలుసుకుని బాలల సంరక్షణ అధికారులకు తెలియజేశారు. బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు జార్ఖండ్‌లోని తల్లిదండ్రులను పిలిపించి ఆశ్రమ నిర్వాహకుల సమక్షంలో కుటుంబ సభ్యులకు బాలుడిని అప్పగించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ చైర్‌పర్సన్‌ సంపూర్ణ, అధికారి చైతన్య కుమార్‌, ఫౌండేషన్‌ సభ్యులు ఉన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య

పిట్లం: ఆర్థిక ఇబ్బందులో ఒకరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన విఠల్‌(37) కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో తాగుడుకు బానిసై గ్రామ శివారులోని మారేడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

పోలీసుల అదుపులో

వసూళ్లకు పాల్పడుతున్న ముఠా

స్వచ్ఛంద సేవా సంస్థల పేరుతో వసూళ్లు

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ ప్రాంతంలో ప్రఖ్యాత స్వచ్ఛంద సంస్థ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను ఆర్మూర్‌ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గత పదిరోజులుగా ఆర్మూర్‌ కేంద్రంగా అడ్డా ఏర్పాటు చేసుకొని ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌ నియోజక వర్గాల్లోని పలు గ్రామాల్లో ఈ ముఠా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. పదిమంది ముఠాగా ఏర్పడి ఇద్దరు చొప్పున గ్రామాల్లో తిరుగుతూ.. ప్రతిరోజు కొంత డబ్బులను వసూలు చేశారు. బోధన్‌ నియెజకవర్గం నవీపేట మండలం నాళేశ్వరంలో తపస్వీ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో తిరుగుతూ వసూళ్లకు పాల్పడ్డారు. కాగా నాళేశ్వరానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధితో పాటు గ్రామస్తులకు ఆర్మూర్‌కు చెందిన తపస్వీ స్వచ్ఛంద సంస్థతో సేవా కార్యక్రామల్లో పాలుపంచుకున్న పరిచయం ఉండటంతో ఆరాతీశారు. ముఠాను పట్టుకోవాలని ప్రణాళిక రచించారు. ఫౌండేషన్‌కు పుట్టిన రోజు సందర్భంగా సహాయం చేస్తామని ముఠాకు చెందిన ఇద్దరిని పిలిపించి ఆర్మూర్‌లోని తపస్వీ సంస్థకు తీసుకెళ్లారు. కాగా వీరు సంస్థకు చెందిన వారు కాదని తేలింది. వీరు మెడ్చల్‌ కేంద్రంగా విజన్‌ ఇండియా ఫౌండేషన్‌ పేరుతో ఐడీ కార్డులు ధరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో 10 మంది ముఠాను సభ్యులను కౌన్సిలర్‌ లిక్కిశంకర్‌ సహాయంతో సంస్థ సభ్యులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు ముఠా సభ్యులను విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement