![రాజన్న(ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/7/06dmp07r-180085_mr.jpg.webp?itok=fTHgGxDS)
రాజన్న(ఫైల్)
ధర్మపురి: బతుకుపోరులో ఏడారిదేశం వెళ్లిన వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. కొద్ది రోజులు చికిత్స పొంది స్వదేశానికి వస్తుండగా.. అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులు అనుమతించలేదు. దీంతో తోటి కార్మికుల గదిలో ఆశ్రయం పొందాడు. అక్కడ సరైన వైద్యం అందక ఈనెల 4న చనిపోయాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన పులిశెట్టి రాజన్న(50) 11ఏళ్లుగా ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్తున్నాడు. అక్కడ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఏడాదికోసారి ఇంటికొచ్చి వెళ్తుండేవాడు. రెండుమాసాల క్రితం గది నుంచి డ్యూటీకి వెళ్తుండగా పక్షవాతంతో రోడ్డుపై పడిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆరుగంటలు కొట్టుమిట్టాడు. అక్కడే ఉంటున్న రాజన్న తమ్ముడు తిరుపతి విషయం తెలుసుకుని ఆస్పత్రికి తరలించాడు. కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోగా.. ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రివారు డిశ్చార్జీ చేశారు. దీంతో తన గదికి తీసుకెళ్లిన తిరుపతి రాజన్న భార్య, ఇద్దరు పిల్లలకు సమాచారం ఇచ్చాడు. వారు స్వగ్రామానికి తీసుకురావాలని సూచించగా.. డిసెంబర్ 22న బయల్దేరారు. సౌదీ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేసిన అధికారులు బీపీ, షుగర్ అధికంగా ఉందని ప్రయాణానికి అనుమతించలేదు. దీంతో రాజన్నను తిరిగి గదికి చేర్చారు. సరైన వైద్యం అందకపోవడంతో ఈనెల 4న మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు తిరుపతి, అక్కడి తెలుగువాళ్లు ప్రయత్నిస్తున్నారు. రాజన్నకు 11ఏళ్ల బీమా, లీగల్ డబ్బులు కంపెనీ చెల్లించాలని కోరుతూ టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ షేక్ చాంద్‌పాషా విదేశీ వ్యవహారాలశాఖకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
సౌదీలో దమ్మన్నపేట వాసి మృతి
మృతదేహం కోసం ఎదురుచూపులు
Comments
Please login to add a commentAdd a comment