ఫీజు బకాయిలు విడుదల చేయాలి
కరీంనగర్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని తెలంగాణచౌక్‌లో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం మారితే జీవితాలు మారుతాయని కోటి ఆశలతో విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే కనీసం విద్యార్థులను పట్టించుకోవడం లేదని వాపోయారు. రెండేళ్లుగా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్, జిల్లా సహాయ కార్యదర్శి భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేశ్, గట్టు ఆకాశ్, రాకేశ్, నగర ఉపాధ్యక్షులు చందు, అక్షయ్, నాయకులు సంతోష్, పవన్, విష్ణు, అక్షయ్, రఘు, విశ్వక్, ప్రణయ్, విష్ణు, హరీశ్, వెంకీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment