కాలుష్యాన్ని నియంత్రించాలి
● దుమ్ము, ధూళితో అనారోగ్య సమస్యలు
● ‘కేశోరాం’ తీరుపై గ్రామసభలో ఫిర్యాదు
పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ కేశోరాం సి మెంట్ కంపెనీ నుంచి వెలువడే దుమ్ము, ధూళితో వాతావరణం కలుషితమవుతోందని, దీనిద్వారా తాము అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రత్యేకాధికారి, మండల పంచాయతీ అధికారి ఉప్పు సుదర్శన్ ఆధ్వర్యంలో మంగళవారం పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. వివిధ సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమ నుంచి దుమ్ము, ధూళి వస్తోందని, శ్వాస సంబంధిత వ్యాధులబారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్కర్స్‌కాలనీలో డ్రైనేజీ సమీపంలోని పంట పొలాల్లోకి చేరుతోందన్నారు. మహిళా సమాఖ్య భవనంలో పంచాయతీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, దీంతో మహిళల సమావేశాలకు ఇబ్బంది ఏర్పడుతోందని అన్నారు. వెంటనే పంచాయతీ భవనం నిర్మించాలని కాంగ్రెస్ నాయకుడు తువ్వ సతీశ్ కోరారు. స్పందించిన ఎంపీవో సుదర్శన్.. సమస్యను ఉన్నతాధికారుల అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం.. పలు పనులకు తీర్మానాలు చేశారు. రూ.10లక్షలతో వర్కర్స్ కాలనీ క్వార్టర్స్ వెనకాల డ్రైనేజీ, సుభాష్‌నగర్ ఎస్సారెస్పీ కాలువపై కల్వర్టు నిర్మించాలని తీర్మానించారు. ఉపాధిహామీ ద్వారా 100రోజుల పనిదినాలు పూర్తిచేసిన ముద్దంగుల రాజం, సిరవేని కొమురయ్య, ఉత్తమ సేవలు అందించిన పంచాయతీ పారిశుధ్య కార్మికుడు బొంకూరి రామస్వామిని పూలమాల, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగాలక్ష్మి, కారోబార్ గుండా రమేశ్, గ్రామస్తులు సల్లూరి భాస్కర్, పోశం, భూమయ్య, రాజం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment