రాజన్న ఆలయంలో నిలువు దోపిడీ
వేములవాడ: రాజన్న క్షేత్రంలో బలవంతపు వసూళ్లు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎక్కడ చూసినా వసూళ్ల పర్వం నడుస్తుందంటూ భక్తులు వాపోతున్నారు. మంగళవారం స్వామివారిని దర్శించుకున్న వరంగల్‌కు చెందిన ఓ భక్తురాలు ఐదు కొబ్బరికాయలు కొట్టేందుకు ఆలయం ముందు ఉచితంగా టెంకాయలు కొట్టే ప్రాంతానికి చేరుకోగా, అక్కడ విధులు నిర్వహించే కాంట్రాక్టర్‌కు చెందిన వ్యక్తులు ఐదు కొబ్బరికాయలకు రూ.50 చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. ఇదేంటని భక్తురాలు ప్రశ్నించినా డబ్బు చెల్లించాల్సిందేనంటూ పట్టబడ్డారు. దీంతో సదరు భక్తురాలు చేసేది లేక రూ.30 చేతిలో పెడితేనే కొబ్బరి ముక్కలను వారికి తిరిగిచ్చారు. కొబ్బరి ముక్కలు పోగు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రీ కౌంటర్‌లో ఇలా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఈ వియమై ఆలయ పర్యవేక్షకుడు నర్సయ్యను వివరణ కోరగా కొబ్బరికాయలు కొట్టే ప్రాంతాల్లో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆలయం బయట ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు సంబంధించిన వ్యక్తులు టెంకాయ కొడుతారని, డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే ఇప్పటికే పలుమార్లు హెచ్చరించామని, సదరు కాంట్రాక్టర్‌తో మాట్లాడి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తానన్నారు. టెంకాయలే కాకుండా గండాదీపంలో నూనె పోసే ప్రాంతం, కోడెలు కట్టే ప్రాంతం, కల్యాణకట్ట, ధర్మగుండం, వసతి గదుల నిర్వహణ, పార్కింగ్ వద్ద ఇష్టారాజ్యంగా వసూళ్ల పర్వం కొనసాగుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని బలవంతపు వసూళ్లను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment