వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టకండి
● కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్‌టౌన్: కరీంనగర్‌లో వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులకు సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఇక్కడ వీధి వ్యాపారులు ధర్నా చేస్తున్న విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు గురువారం ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు. సీపీ అభిషేక్ మహంతి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్‌లకు ఫోన్ చేశారు. పొట్టకూటి కోసం వీధుల్లో వ్యాపారం చేసుకుంటున్నవాళ్ల వస్తువులను స్వాధీనం చేసుకుంటూ, ఫైన్లు వేస్తూ ఇబ్బంది పెడుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి, వాళ్లతో సామరస్యపూర్వకంగా మెలగండి అని కోరారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
నెలాఖరులో మల్టీపర్పస్ పార్క్ ప్రారంభం
● మేయర్ సునీల్‌రావు
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.13 కోట్లతో ఆధునీకరిస్తున్న మల్టీపర్పస్ పార్క్‌ను ఈ నెలాఖరులో ప్రారంభిస్తామని మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. గురువారం పార్క్ పనులను నగర పాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్‌తో కలిసి పరిశీలించారు. 24లోగా పనులు పూర్తి చేయాలని ఏజెన్సీ కాంట్రాక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. పార్క్‌లో ప్రవేశానికి రుసుము కూడా ఉంటుందన్నారు. కార్పొరేటర్లు వాల రమణారావు, కంసాల శ్రీనివాస్, అఖిల్ ఫిరోజ్, తుల రాజేశ్వరి, సుధగోని మాధవి, ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ యాదగిరి, డీఈ అయూబ్‌ఖాన్, ఏఈ గఫూర్ తదితరులున్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నగరంలోని 14వ డివిజన్ రాంనగర్ టెలిఫోన్ క్వార్టర్స్ వద్ద రూ.16.50 లక్షలతో రెండుచోట్ల చేపట్టనున్న సీసీరోడ్లు, డ్రైనేజీ పైప్‌లైన్ పనులకు మేయర్ సునీల్‌రావు శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ దిండిగాల మహేశ్, ఈఈ సుబ్రమణ్యం, డీఈ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
సప్తగిరికాలనీ(కరీంనగర్): దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి కె.వెంకటేశ్ అన్నారు. గురువారం నగరంలోని చైతన్యపురి అడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో 20 మంది దివ్యాంగులకు ఐజీఏ ఆర్థికాభివృద్ధి కింద రూ.15 వేల చొప్పున లోన్ అందించారు. కార్యక్రమంలో ఫాదర్ సంతోష్, ఫాదర్ అలెక్స్, తణుకు మహేశ్, సిస్టర్ ప్రీత, తెస్సీ, దీప్తి, వెలంగాణి తదితరులు పాల్గొన్నారు.
ఒక ఓటు ఎనిమిదిసార్లు నమోదు
● సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్ ఆరోపణ
కరీంనగర్: ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్‌లకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదులో తప్పులు దొర్లాయని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆరోపించారు. ఒక ఓటు గరిష్టంగా ఎనిమిదిసార్లు నమోదైందన్నారు. గురువారం కరీంనగర్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు నమోదులో తప్పులపై ఎలక్షన్ కమిషన్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, గొట్టం మహేశ్, పొన్నం అనిల్‌గౌడ్, కెమసారం తిరుపతి, పెండ్యాల మహేశ్, సాయిండ్ల కొమురయ్య, బుడిగె పర్శరాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment