బారికేడ్లు.. ట్రాఫిక్‌జాంకు చెక్
● నగరంలోని ఎన్‌టీఆర్ చౌరస్తా, కమాన్ వద్ద ఏర్పాటు
● సాఫీగా వెళ్లిపోతున్న వాహనదారులు
● ట్రాఫిక్ పోలీసుల ఆలోచన
బాగుందని కితాబు
కరీంనగర్ క్రైం: జిల్లా కేంద్రంలో జనాభా, వాహనాలు, వివిధ పనులపై ఇక్కడికి వచ్చే ప్రజల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాం అవుతోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యలున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు దృష్టిపెట్టి, నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ జాం అవకుండా బారికేడ్లను డివైడర్ మాదిరిగా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్య ఏళ్లనాటిది. ఇక్కడ బారికేడ్లు పెట్టడంతో వాహనాలు గుమికూడటం లేదు. కరీంనగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో కమాన్ వద్ద సమస్య పరిష్కారానికి కూడా పోలీసులు ఇలాగే చేశారు. ఎలాంటి అయోమయానికి గురవకుండా వెళ్తున్నామని, ట్రాఫిక్ పోలీసుల ఆలోచన బాగుందని వాహనదారులు కితాబునిస్తున్నారు.
రోజూ లక్షకు పైగా వాహనాలు..
జిల్లా నలుమూలల నుంచి కరీంనగర్‌కు నిత్యం లక్షకు పైగా వాహనాలు వచ్చి, వెళ్తుంటాయి. వీటిలో 50 వేలకు పైగా హైదరాబాద్, వరంగల్‌ల వైపు కమాన్ మీదుగా వెళ్తుంటాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సిరిసిల్ల బైపాస్ నిర్మించాక సిరిసిల్ల నుంచి వరంగల్, హైదరాబాద్, పెద్దపల్లి వైపు వెళ్లే భారీ వాహనాలు సిటీలోకి రావడం లేదు. దీంతో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌జాం ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు పడేవారు. ఇటీవల పోలీసు శాఖ, వివిధ శాఖల మధ్య సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి పోలీసులు పలు పరిష్కార మార్గాలు సూచించారు. కోర్టు రోడ్డులో, రాంనగర్, మంచిర్యాల చౌరస్తాతో, టవర్‌సర్కిల్, మార్కెట్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
సమస్యలు పరిష్కరిస్తున్నాం
నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ చౌరస్తా, కమాన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశాం. దీంతో వాహనదారులు ఎవరి దారిలో వారు అయోమయం లేకుండా వెళ్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేస్తాం. – కరీముల్లాఖాన్, ట్రాఫిక్ సీఐ
ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు
‘బస్టాండ్ నుంచి కమాన్ మీదుగా వెళ్లే వాహనాలు, హౌసింగ్‌బోర్డు, టవర్ సర్కిల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఒకేసారి రావడంతో నిత్యం ఉదయం, సాయంత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్‌జాం అవుతుంది. ఇది గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు కమాన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌జాం సమస్యకు చెక్ పడింది.’
Comments
Please login to add a commentAdd a comment