డబ్బులు లెక్కిస్తానని నొక్కేశాడు
వేములవాడ: వేములవాడ యూనియన్ బ్యాంకులో ఓ వ్యక్తి డబ్బు డ్రా చేయగా, మరో వ్యక్తి సదరు డబ్బును లెక్కిస్తానని కొంత నొక్కేసిన ఘటన గురువారం జరిగింది. బ్రాంచ్ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాలు.. శాత్రాజుపల్లికి చెందిన వృద్ధుడు గుడిసె మాణిక్యం గురువారం తన ఖాతా నుంచి రూ.20వేలు డ్రా చేశాడు. ఇది గమనించిన సిరిసిల్లకు చెందిన వ్యక్తి, మాణిక్యం వద్దకు వచ్చి డబ్బులు లెక్కబెట్టి ఇస్తానని నమ్మబలికి రూ.7వేలు నొక్కేశాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వృద్ధుడు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బ్యాంక్ సిబ్బంది పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేదు. దీంతో బ్యాంకు సబ్‌స్టాఫ్ తాళ్లపల్లి రాజేశ్ సహాయంతో ఓ వైన్స్ ఎదుట కనిపించిన వ్యక్తిని పట్టుకుని ఠాణాకు తరలించారు. వెంటనే సదరు వ్యక్తి జేబులోంచి రూ.7వేలు రికవరీ చేసి వృద్ధుడికి అప్పగించారు. లెక్కిస్తానని నొక్కేసిన వ్యక్తిని పట్టుకునేందుకు కృషిచేసిన బ్యాంకు ఉద్యోగి రాజేశ్‌ను బ్యాంక్ అధికారులు, పోలీసులు అభినందించారు. నిందితుడిని సిరిసిల్ల కు చెందిన వ్యక్తిగా గుర్తించామని, కేసు నమోదు చేసినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
వేములవాడ యూనియన్ బ్యాంక్‌లో ఘటన
సీసీ కెమెరాల ఆధారంగా గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment