ముంబైలోనే ముగిసిన జీవితం
● గుండెపోటుతో వలసజీవి మృతి
ధర్మపురి: ఉపాధి నిమిత్తం తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న ఊరును వదిలి ముంబై నగరానికి పొట్టకూటి కోసం వెళ్లిన ఓ వలసజీవి జీవితం అక్కడే ముగిసిపోయింది. స్థానికుల వివరాలు.. ధర్మపురి పట్టణానికి చెందిన నరెడ్ల శంకర్(58) నలభై ఏళ్ల క్రితం ఉపాధి కోసం ముంబై వెళ్లాడు. అక్కడే దినసరి కూలీగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా అధైర్యపడకుండా తన రెక్కల కష్టంతో వారిని ఉన్నత చదువులు చదించాడు. ఈ క్రమంలో ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగం సాధించగా, మరో కూతురు ప్రైవేటు జాబ్ చేస్తోంది. అందరికీ పెళ్లిళ్లు చేశాడు. తన భార్య, పిల్లలతో ముంబైలో ఉంటే ఖర్చుల భారం అధికమవుతుందని ఒక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అవసరమైన సందర్భాల్లో స్వగ్రామానికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం పనికి వెళ్లి రాత్రి తన అద్దె ఇంట్లో పడుకున్నాడు. ఉదయం తోటి మిత్రులు ఎంత పిలిచినా లేవకపోవడంతో అక్కడే సమీపంలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు తలుపులు పగులగొట్టి చూడగా శంకర్ విగతజీవిగా పడిఉన్నాడు. గుండెపోటుతోనే శంకర్ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. బంధువుల సాయంతో మృతదేహాన్ని ఇంటికి తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖాతా నుంచి రూ.1.59 లక్షలు మాయం
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం అంబారిపేట జెడ్పీ స్కూల్‌లో పనిచేస్తున్న పెంట గంగాధర్ అనే ఉపాధ్యాయుడికి తెలియకుండానే తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.1,59,014 మాయమైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశా డు. కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన గంగాధర్ బుధవారం కోరుట్లలోని ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతా నుంచి మూడుసార్లు డబ్బులు డ్రా అయినట్లు ఆలస్యంగా గుర్తించారు. బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి చెప్పారు. సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబర్ 1930లో ఫిర్యాదు చేశారు. గురువారం కథలాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment