అంజన్న సన్నిధిలో కానరాని సౌకర్యాలు
● గుట్టపై కానరాని బేబీ ఫీడింగ్ సెంటర్
● పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అయితే తల్లులు పిల్లలకు పాలు ఇచ్చేందుకు మాత్రం బేబీ ఫీడింగ్ సెంటర్ లేదు. అలాగే అత్యవసర వైద్యం అందించేందుకు ఆస్పత్రి లేదు. ఇక వికలాంగులకు స్వామివారి దర్శనభాగ్యం కలగడం అతి కష్టంతో కూడుకుంటోంది.
తల్లుల అవస్థలు
స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో చంటి పిల్లలతో వచ్చే తల్లులు.. పిల్లలు ఏడిస్తే పాలు పట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. క్యూలైన్ నుంచి బయటకు రావడానికి ప్రత్యామ్నాయ దారి లేదు. పాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు లేవు. క్యూలైన్‌లోనే ఓ మూలన కూర్చుని పాలిచ్చే పరిస్థితి ఏర్పడింది.
వైద్యం అందని దైన్యం
దర్శన సమయంలో భక్తులు గంటతరబడి వేచి ఉండడం ద్వారా కొందరికి ఫిట్స్ వస్తున్నాయి. అలాగే కాళ్లు కూడా లాగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుడి అవపరం ఉంటుంది. అయితే గుట్టపై ఆస్పత్రి లేదు. దీంతో భక్తులు గుట్టపై ఉండే ఓ ఆర్‌ఎంపి వద్ద, గుట్ట కింద మల్యాలలో ఉన్న డాక్టర్ల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు.
వికలాంగులు.. పండుటాకుల ఇబ్బంది
వీఐపీలకు స్వాగతం పలికేందుకు ఆలయం ముందు నిలబడే అధికారులు.. వికలాంగులు, పండుటాకులపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్నవారు ఎంత బతిమిలాడిన స్వామివారి దర్శనానికి మాత్రం పంపించడం లేదు. దీంతో గుడి వెనక ఉన్న మెట్ల వెంబడి అవస్థలు పడుతూ ఆలయంలోకి చేరుకుంటున్నారు. ఇదే విషయాన్ని అధికారులను అడిగితే నడవలేని స్థితిలో ఉన్నప్పుడు దర్శనానికి రావడమెందుకని ఈసడించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment