పంచాయతీ సందడి
● ఎన్నికల ఏర్పాట్లు షురూ.. ● పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా సిద్ధం ● జిల్లాలో 313 గ్రామ పంచాయతీలు
పంచాయతీ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. గ్రామాలు, వార్డుల వారీగా ఇప్పటికే ఓటర్ల జాబితాను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఆశావహులు గ్రామాల్లో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2తో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు రావాల్సిన గ్రాంట్స్ ఆగిపోనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది.
కరీంనగర్:
ఈ నేపథ్యంలో ఈ నెల 7న కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటించారు. జిల్లాలో మొత్తం 313 గ్రామ పంచాయతీలు ఉండగా 2,966 వార్డులకు గానూ పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ నెల 12 వరకు వీటిపై అభ్యంతరాలను స్వీకరించారు. 17న అన్ని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
లోక్‌సభ ఎన్నికల వల్లే ఆలస్యం
ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం జూలై 3, 4 తేదీలతో ముగిసింది. ఫిబ్రవరి నెలలోనే పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉండగా, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేశారు. జూలై మొదటి వారంలో జిల్లా, మండల పరిషత్‌లలో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావించినా సాధ్యపడలేదు.
పెరుగుతున్న పోటీ..
గ్రామాల్లో మాజీ సర్పంచ్‌లతోపాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు సర్పంచ్ పదవిని దక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సంపన్నులు సర్పంచ్ కావాలన్న పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తమకు పోటీ చేసే అవకాశం ఇ వ్వాలంటూ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా.. ఇతర పార్టీలకు చెందిన నాయకులు తమ అధి ష్టానాన్ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మూడు విడతల్లో ఎన్నికలు?
2019లో మూడు విడతల్లో గత పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో 178 మంది ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ, 15 ఎంపీపీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో స్థానిక సంస్థలకు సంబంధించి మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వు చేయడంతో జిల్లాలోని పంచాయతీల్లో మెజారిటీ స్థానాలు మహిళలకే దక్కాయి. ప్రభుత్వం ఎన్నికల నిర్వహిస్తే రెండు మాసాల వ్యవధిలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలున్నాయి.
బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా..
పంచాయతీ రిజర్వేషన్లు మారుతాయా.. లేక పాత వాటి ప్రకారమే కొనసాగిస్తారా.. అన్న సందిగ్ధం నెలకొంది. వాస్తవానికి పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లనే కొనసాగించాలి. కానీ, కొత్త ప్రభుత్వం చట్ట సవరణ చేస్తే రిజర్వేషన్లు మారవచ్చు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు వార్డు సభ్యులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలు పంపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు బీసీ గణన తెరపైకి రావడంతో రిజర్వేషన్లు మారుతాయన్న ప్రచారం జరుగుతోంది. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ రిజర్వేషన్లు పెంచాలన్న ఉద్దేశంతో సర్కారు చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో దాదాపు చివరి దశకు చేరుకోగా, డాటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ల ఖరారు తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే చెప్పింది. అయితే, పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోవడంతో ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.
సిద్ధంగా ఉన్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నాం. గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేశాం. పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయ్యింది. బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాల ము ద్రణ ఇతరత్రా ఏర్పాట్లపై దృష్టిసారించాం.
– ఎ.రవీందర్, డీపీవో
Comments
Please login to add a commentAdd a comment