విచారణ అటకెక్కినట్లేనా?
● గతంలో నగరంలోని జంక్షన్ల అక్రమాలపై విచారణకు ఆదేశం ● కాలయాపనతో ఎటూ తేల్చని వైనం ● తాజాగా బిల్లులు చెల్లించేందుకు సిద్ధమైన బల్దియా
‘జిల్లాలో దందా కొనసాగుతోంది. కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారుతుర్రు. ఒక్కొక్కరు పది వర్క్‌లు తీసుకుంటర్రు. ఇక్కడ కొబ్బరికాయ కొడుతరు. తట్ట మొరం వేస్తరు, పోతరు. ఇంకోకాడ మరో పని మొదలు పెడుతరు. ఎక్కడో ఒక కాడ బిల్లులు రాకపోతే ఇక్కడ పని ఆపుతరు. వేరేవాళ్లను రానీయరు. ఎవరో లీడర్లను పట్టుకొని కమీషన్లు ఇచ్చి పనులు చేయించుకొంటరు.’
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
బండి సంజయ్ మంగళవారం
కరీంనగర్‌లో చేసిన హాట్ కామెంట్స్.
కరీంనగర్ కార్పొరేషన్:
స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలో చేపట్టిన పనుల్లోనూ ఇంచుమించూ ఇదేరకం దందా కొనసాగింది. ఒక్కో కాంట్రాక్టర్ నాలుగైదు చోట్ల పనులు చేపట్టి, ఇష్టారీతిన అంచనాలు భారీగా పెంచుకున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇలా నగరంలో చేపట్టిన జంక్షన్ల నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో చేపట్టిన విచారణ అటకెక్కినట్లే కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నగరంలోని తెలంగాణ చౌక్, వన్‌టౌన్ పోలీసు స్టేషన్, హౌసింగ్‌బోర్డుకాలనీ చౌరస్తా, రాజీవ్‌రహదారి జంక్షన్, సదాశివపల్లి జంక్షన్, బొమ్మకల్ ఫ్‌లైఓవర్ జంక్షన్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో నాలుగు జంక్షన్లు పూర్తి కాగా, వన్‌టౌన్ పోలీసు స్టేషన్, బొమ్మకల్ ఫ్‌లైఓవర్ జంక్షన్ పనులు పూర్తి కావాల్సి ఉంది.
అంచనాలపై పెంపుపై విచారణ
నగరంలో స్మార్ట్‌సిటీ నిధులతో చేపట్టిన జంక్షన్ల నిర్మాణాల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. తెలంగాణచౌక్, హౌసింగ్‌బోర్డు జంక్షన్ తదితర జంక్షన్‌ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క అంచనాలు భారీగా పెంచుకున్నారని బీఆర్‌ఎస్ కార్పొరేటర్ బండారి వేణు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. విచారణ ప్రక్రియ కొనసాగినా, గత నాలుగైదు నెలల నుంచి విచారణ ఊసే లేకుండా పోయింది. విచారణ పూర్తయిందా, పూర్తయితే ఏం చర్యలు తీసుకున్నారు, లేదంటే అంతా సక్రమంగానే ఉందా...అనేది ఏదీ కూడా బయటకు పొక్కడం లేదు.
బిల్లులు చెల్లించేందుకు సిద్ధం
నగరంలోని జంక్షన్ల అక్రమాలపై ఫిర్యాదులు, విచారణలు ఉండగానే మరోసారి బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. గతంలోనూ జంక్షన్లపై ఓ వైపు ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందుతుండగానే, మరో వైపు కోట్లాది రూపాయల బిల్లులు సంబంధిత కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఆ తరువాత విచారణ కొనసాగిన క్రమంలో 15శాతం బిల్లులు నిలిపివేశారు. ప్రస్తుతం విచారణ ఊసే లేకుండా, మిగిలిన 15శాతం బిల్లులు కూడా చెల్లించేందుకు నగరపాలకసంస్థ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మకై ్క అంచనాలు భారీగా పెంచి దోచుకున్నారని, నాణ్యత పాటించలేదంటూ ఫిర్యాదులు వచ్చినా, ఇప్పటిరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఉన్నతస్థాయిలో కాపాడే ప్రయత్నంలో భాగంగానే, విచారణను అటకెక్కించారనే విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment