‘దాడులను ప్రోత్సహించడం మూర్ఖత్వం’
● బీజేపీ నాయకులు ● ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
కరీంనగర్‌టౌన్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని బీజేపీ కరీంనగర్ నాయకులు ఖండించారు. మంగళవారం స్థానిక కోర్టు చౌరస్తాలో నిరసన తెలిపి, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాడుల సంస్కృతి సమంజసం కాదని, చట్ట వ్యతిరేక పనులను కాంగ్రెస్ ప్రోత్సహించడం మూర్ఖత్వమని పేర్కొన్నారు. అధికారం ఉందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, భయభ్రాంతులకు గురిచేస్తూ కార్యాలయాలపై దాడులకు తెగబడటం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
గురుకుల విద్యార్థులకు పరామర్శ..
కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శర్మనగర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యార్థులను బీజేపీ నాయకులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, ఫుడ్ పాయిజన్ గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా నివారణ చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు, నాయకులు వంగల పవన్, కొలగని శ్రీనివాస్, కటకం లోకేశ్, నాగసముద్రం ప్రవీణ్, శివారెడ్డి, పాదం శివరాజు, కరండ్ల రతన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment